Begin typing your search above and press return to search.

తండ్రీ కొడుకుల డీల్ ఫైనల్ కాలేదట

By:  Tupaki Desk   |   4 Jan 2017 4:30 AM GMT
తండ్రీ కొడుకుల డీల్ ఫైనల్ కాలేదట
X
యూపీ అధికారపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం అంతకంతకూముదురుతోంది. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన పరిణామాలకు భిన్నంగా.. రాత్రి వేళకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నీకిది..నాకిది అన్నట్లుగా తండ్రీ కొడుకుల మధ్య రాజీ కుదిరిందని.. దీని ప్రకారం సమాజ్ వాదీ పార్టీ చీఫ్ పదవి నుంచి తాను వైదొలుగతానని అఖిలేశ్ చెబుతూ..అందుకు ప్రతిగా సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలని.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అధికారం తనకే దఖలు చేయాలని కోరటంపై ఒక రాజీ ఫార్ములా ఓకే అయ్యిందన్న వాదన వినిపించినా.. అంతిమంగా అలాంటిదేమీచోటు చేసుకోలేదు.

దీనికి భిన్నంగా.. ఇప్పటికే సమయం మించిపోయిందని.. అఖిలేశ్ వర్గ నేతలు ప్రకటించటంతో సమాజ్ వాదీ పార్టీ చీలిక దిశగా పయనిస్తోందంటూ వస్తున్నవార్తలకు ఊతం లభించినట్లుగా చెప్పొచ్చు. ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న తండ్రి ములాయంను.. కుమారుడు అఖిలేశ్ యాదవ్ కలిసి.. రెండు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య నెలకున్న దూరం తగ్గి.. రాజీఫార్ములాతో బయటకు వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

అయితే.. ఇందులో నిజం లేదన్న విషయం పార్టీ సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ప్రస్తుత తరుణంలో రాజీకి ఎలాంటి అవకాశం లేదని.. ఎస్పీ ఎన్నికల గుర్తును ఈసీ నిర్ణయిస్తుందని చెప్పటంతో.. సైకిల్ ను రెండు ముక్కలయ్యే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది.

మరోవైపు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉండటంతో.. సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా.. ఆ పార్టీ గుర్తు అయిన సైకిల్ ను ఏ వర్గానికి ఇవ్వకుండా తాత్కాలికంగా ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. ఈఎన్నికల్లో తండ్రీ కొడుకు వర్గాలు చెరొక గుర్తుతో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.ఈ ఎన్నికల వరకూ సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించరు. పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలకు వెళితే.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. సైకిల్ గుర్తు లేని సమాజ్ వాదీని యూపీ ప్రజలు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/