Begin typing your search above and press return to search.

బాబుకు బీపీ పెంచేలా గ‌డ్క‌రీ టూర్‌

By:  Tupaki Desk   |   24 Dec 2017 3:01 PM GMT
బాబుకు బీపీ పెంచేలా గ‌డ్క‌రీ టూర్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న పోల‌వ‌ర ప్రాజెక్టు ఆయ‌న‌కు ఇర‌కాటంలో ప‌డేసే స్థాయికి చేరుతోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఒక‌దాని వెంట ఒకటి అన్న‌ట్లుగా సాగుతున్న ప‌రిణామాలు ఏపీ స‌ర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల సందర్శన విషయంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖం చాటేసినట్లు సమాచారం. గడ్కరీ పర్యటనపై రోజుకో తేదీని చంద్రబాబు సర్కారు ప్రచారంలో పెడుతుండగా వాటిపై కేంద్ర జలవనరుల శాఖ నుంచి కానీ, మంత్రి కార్యాలయ వర్గాల నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని తెలిసింది. గడ్కరీ అసలు వస్తారా లేదా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

పోలవరం స్పిల్‌ వే - స్పిల్‌ చానల్‌ కాంట్రాక్టు పనుల్లో కొన్నింటిని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రారు నుంచి తప్పించి వేరే సంస్థలకు అప్పగించేందుకు ఏపీ సర్కారు నవంబర్‌ నెలలో టెండర్లు పిలవగా వాటిని తక్షణం నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ అదే నెల 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభ్యంతరం తెలిపారు.ఈ తరుణంలో ఈ నెల 5న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు - అధికారులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి గడ్కరీతో భేటీ వేశారు. తాను పోలవరం పనులను డిసెంబర్‌ 22న క్షేత్ర స్థాయికొచ్చి పర్యవేక్షించాకనే తదుపరి ఆదేశాలు - నిర్ణయాలు ఉంటాయని గడ్కరీ ప్రకటించారు. దాంతో ఏపీ అధికారులు గడ్కరీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లి గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలోనూ తాను ఇంతకు ముందు చెప్పినట్లు పోలవరం వస్తానని గడ్కరీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు విదేశాలకెళ్లారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన మూలంగా గడ్కరీ పోలవరం సందర్శన 22కు బదులు 23న ఉంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు ప్రచారంలో పెట్టాయి. తదుపరి డిసెంబర్‌ 26 - 27 తేదీల్లో ఏదో ఒక రోజు తప్పకుండా గడ్కరీ పోలవరం వస్తారని మీడియాకు లీకులిచ్చారు. ఆ తేదీలు సమీపిస్తున్నా గడ్కరీ నుంచి ఎలాంటి వర్తమానం లేకపోవడంతో కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఈ నెల 27న అమరావతికి రాష్ట్రపతి వస్తున్నారని, అందువల్ల తామే గడ్కరీని రావొద్దన్నామని, పర్యటనను వాయిదా వేసుకోమని సలహా ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు.

అయితే రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మాత్రం ఇందుకు భిన్న‌మైన స‌మాధానం ఇస్తున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జనవరి 5 వరకు ఉన్నందున ఆలోపు గడ్కరీ పర్యటన ఉండదని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఒక వేళ వస్తే వచ్చేనెల ఆరేడు తేదీల్లో గడ్కరీ పోలవరం సందర్శనకు రావొచ్చని వెల్లడించాయి. కాగా ఈ నెల 13న సీఎంతో సమావేశమైనప్పుడు స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో ట్రాన్స్‌ స్ట్రాయ్‌ కి నెల రోజులు గడువివ్వాలని, ఆ లోపు ఎలాంటి ప్రగతి చూపకపోతే కొత్త టెండర్లపై నిర్ణయం తీసుకుందామని గడ్కరీ ప్రతిపాదించారు. అంతలోనే కేంద్ర జలసంఘం - పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, నిపుణులు వరుసగా పోలవరం పనులను పరిశీలిస్తున్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా గడ్కరీ క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుందని, ఇక్కడికి రాకుండానే ఢిల్లీలో నిర్ణయాలు తీసుకునే అవకాశమూ లేకపోలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థూలంగా గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న రాష్ర్ట ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి బీపీ పెంచేదిగా మారిపోయింద‌ని అంటున్నారు.