Begin typing your search above and press return to search.

పోలవరానికి గడ్కరీ మళ్లీ డుమ్మా కొట్టినట్టేనా?

By:  Tupaki Desk   |   4 Jan 2018 4:19 AM GMT
పోలవరానికి గడ్కరీ మళ్లీ డుమ్మా కొట్టినట్టేనా?
X
పోలవరం విషయంలో అంతా సానుకూలంగానే ఉన్నట్లు.. అనుకున్న విధంగా 2018 చివరి నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతూనే ఉంటారు. అయితే కేంద్రం ఈ ప్రాజెక్టు పట్ల కనబరుస్తున్న ధోరణి చాలా తేడాగా ఉన్నదనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం పనుల్ని నిర్వహిస్తున్న తీరును అనుమానిస్తున్న కేంద్ర సర్కార్.. ఈ ప్రాజెక్టు పనుల నిర్వహణ కూడా పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోదలచుకుంటున్నదని.. అందుకు అనుగుణంగా.. జాప్యం చేస్తున్నదనే వాదనలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో నిధుల విడుదలను పూర్తిగా ఆపేసి - రకరకాల కారణాలు చెబుతూ.. సాగతీస్తున్న కేంద్రం చంద్రబాబు సహా - ఏపీ మంత్రులు - అధికార్లతో వేర్వేరు సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత.. అంతా మేం చూసుకుంటాం అన్నట్లుగా ప్రకటించింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పోలవరం ప్రాజెక్టును నేను విజిట్ చేస్తా అంటూ కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు కూడా. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆయన పోలవరం రాలేదు. ఈనెల 7న ఆయన పర్యటన ఖరారు అని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలు గమనిస్తోంటే ఆ రోజున కూడా వస్తారో లేదో అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

పోలవరం పనుల్ని వర్చువల్ సమీక్షల ద్వారా ప్రతి సోమవారం చంద్రబాబునాయుడు సమీక్షిస్తున్నారు. అయితే ఇది అసలు మా ప్రాజెక్టు అంటున్న నితిన్ గడ్కరీ తాను 15 రోజులకు ఒకసారి ప్రత్యక్షంగా విజిట్ చేస్తానని ప్రకటించారు. పనులు జరగడానికి అది మంచి నిర్ణయమే. అయితే ఆయన ఇప్పటిదాకా రాలేదు. గత నెలలో రెండుసార్లు గడ్కరీ టూర్ ప్రోగ్రాం నిర్ణయించారు. రెండు సందర్భాల్లోనూ చివర్లో రద్దయింది. కేంద్రం తరఫున వేర్వేరు కమిటీలు మాత్రం విజిట్ చేసి.. జరుగుతున్న పనుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయాలోచూసి వెళ్లాయి. జనవరి 7న గడ్కరీ టూర్ ఉంటుందని ఓ ప్రకటన వచ్చింది. అయితే బుధవారం నాడు సమావేశంలో.. 8వ తేదీన పోలవరం పర్యటనకు వెళ్లబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షెడ్యూలు విడుదల అయింది. 8న చంద్రబాబు అక్కడకు వెళుతున్నారంటే.. దాని అర్థం 7న గడ్కరీ రాకపోవచ్చునని అనుమానం ప్రజలకు కలుగుతోంది. గడ్కరీ వస్తే గనుక.. ఆయనతో పాటు చంద్రబాబు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది.. చంద్రబాబు 8న షెడ్యూలు పెట్టుకున్నారంటే... గడ్కరీ ఈ నెల కూడా డుమ్మా కొట్టినట్లేనా అని ప్రజలు భావిస్తున్నారు. ఈ లెక్కన నిధులు విడుదల చేయాల్సిన అసలు కీలక వ్యక్తి ఎప్పటికి వస్తారో.. ఎప్పటికి నిధులను అనుగ్రహిస్తారో.. ఎప్పటికి పనులు పూర్తవుతాయో అని కూడా అనుకుంటున్నారు.