Begin typing your search above and press return to search.

ప‌రిటాల వాస‌రుడి క‌ల నెర‌వేరేనా?

By:  Tupaki Desk   |   11 March 2019 3:21 PM GMT
ప‌రిటాల వాస‌రుడి క‌ల నెర‌వేరేనా?
X
రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లా ఏపీలో అధికార పార్టీకి పెట్ట‌ని కోట‌గానే ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమలో స‌త్తా చాటిన విప‌క్ష వైసీపీ అనంత‌పురంలో మాత్రం చ‌తికిల‌బ‌డింద‌నే చెప్పాలి. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా స‌త్తా చాటిన వైసీపీ... అనంత‌పురంలో మాత్రం అంత‌గా రాణించ‌లేద‌నే చెప్పాలి. ఇందుకు చాలా కార‌ణాలే ఉన్నా... టీడీపీకి ఆ జిల్లాలో కీల‌క నేతలు ఉన్నారు. ప‌రిటాల కుటుంబంతో పాటుగా బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం కూడా ఆ జిల్లాలో చ‌క్రం తిప్పుతోంది. ఇక ఎన్నిక‌ల ముందు జేసీ దివాక‌ర్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో టీడీపీకి తిరుగులేని విజ‌యాలు ఆ జిల్లాలో న‌మోద‌య్యాయి. ఇదంతా గ‌తం అనుకుంటే... ఈ ద‌ఫా ఆ జిల్లాలో టీడీపీకి ఆశించిన మేర ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన చంద్రబాబు... ఎప్పుడెప్పుడు ఎన్నిక‌ల బ‌రిలోకి దూకుదామా? అంటూ ఎదురు చూస్తున్న ప‌రిటాల వార‌సుడు శ్రీ‌రామ్‌కు సంబంధించి నిర్ణ‌యాన్ని పెండింగ్ లో పెట్టేశారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే తెరంగేట్రం చేసిన శ్రీ‌రామ్‌... ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌చారంతో పాటు తెర వెనుక రాజ‌కీయాల‌ను బాగానే న‌డిపించారు. నాటి కృషి నేటి ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఇస్తుంద‌ని శ్రీ‌రామ్ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీ‌రామ్ విష‌యంపై చంద్ర‌బాబు మాత్రం నోరు విప్ప‌డం లేదు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటామ‌ని, త‌మ స్థానాల‌ను త‌మ కుమారుల‌కు ఇవ్వాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్ పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పేసిన చంద్ర‌బాబు... ప‌రిటాల ఫ్యామిలీ విష‌యంలో వేచి చూసే ధోర‌ణినే అవ‌లంబిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌రిటాల సునీత‌కు సిట్టింగ్ స్థానం నుంచే పోటీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన చంద్ర‌బాబు... శ్రీ‌రామ్ విష‌యంలో మాత్రం ఏదీ తేల్చ‌డం లేదు. జిల్లాలోని క‌ళ్యాణదుర్గం అసెంబ్లీని త‌న కుమారుడికి ఇవ్వాల‌ని, లేనిప‌క్షంలో హిందూపురం పార్ల‌మెంటు అయినా ఓకేన‌ని ఇప్ప‌టికే ప‌రిటాల సునీత‌... చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టారు. దీనిపై సింగిల్ మాట కూడా చెప్ప‌ని చంద్ర‌బాబు... సునీత‌కు మాత్రం టికెట్ క‌న్‌ఫార్మ్ చేశారు.

ఇప్పుడు ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా వ‌చ్చేసింది. అయినా కూడా ప‌రిటాల శ్రీ‌రామ్ అభ్య‌ర్థిత్వంపై చంద్ర‌బాబు గుంభ‌నంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌రిటాల ఫ్యామిలీ కోరుతున్న క‌ళ్యాణ‌దుర్గం సీటును టీడీపీ సీనియర్ నేత - ఎస్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబుకు కేటాయించే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి అదే జ‌రిగితే... శ్రీ‌రామ్ ప‌రిస్థితి ఏమిట‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక హిందూపురం పార్ల‌మెంటు సీటును కూడా అక్క‌డ సిట్టింగ్ గా ఉన్న నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌... ఈ ద‌ఫా ఆ సీటును త‌న కుమారుడికి ఇప్పించుకునే య‌త్నాల‌ను ముమ్మ‌రంగానే సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రిటాలకు ఈ ద‌ఫా అస‌లు అవ‌కాశం ద‌క్కుతుందా? లేదా? అన్న విష‌యంపై ఇప్పుడు జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.