Begin typing your search above and press return to search.

తిరుపతి ఉపఎన్నిక జరుగుతుందా ?

By:  Tupaki Desk   |   16 March 2021 1:30 AM GMT
తిరుపతి ఉపఎన్నిక జరుగుతుందా ?
X
ఇపుడిదే అంశంపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ చనిపోయి ఈరోజుకు సరిగ్గా ఆరుమాసాలైపోయింది. మామూలుగా ప్రజాప్రతినిధి చనిపోయిన ఆరుమాసాల్లోగా ఉపఎన్నికైనా నిర్వహించాలి లేదా షెడ్యూల్ అయినా ప్రకటించాలి. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సభ్యునిగా ఎన్నికైన బల్లి 2020 సెప్టెంబర్ 16న మరణించారు. అంటే అప్పటినుండి మార్చి 16వ తేదీకి ఆరుమాసాలు పూర్తయిపోయింది.

ఇపుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ+పార్లమెంటు ఉపఎన్నికలతోనే తిరుపతి ఎన్నిక కూడా జరుగుతుందని అనుకున్నారు. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటు నియోజకవర్గాల ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్ సభ స్ధానాల ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే రెండు పార్లమెంటు స్ధానాలకు సపరేటుగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటితో పాటు తిరుపతి ఉపఎన్నికకు కూడా నోటిఫికేషన్ వస్తుందని అందరు అనుకున్నారు. కానీ కేవలం రెండు స్ధానాలకు మాత్రము కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఊర్కుంది. దాంతో తిరుపతి ఉపఎన్నిక విషయంలో సస్పెన్సు పెరిగిపోతోంది.

ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషనర్ ను ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా దాటేశారు. ఉప ఎన్నికల విషయంలో సహచర కమీషనర్ షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పి తప్పించుకున్నారు. తీరాచూస్తే తిరుపతి ఉపఎన్నిక మాత్రం పెండింగ్ లో పడిపోయింది. దాంతో తిరుపతికి ఉపఎన్నిక జరగకపోవటానికి తెరవెనుక ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.