Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదా? విచారించారా?

By:  Tupaki Desk   |   20 Jun 2022 12:15 PM GMT
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదా? విచారించారా?
X
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా అందరూ అనుమానిస్తున్నట్టు సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని తెలిసింది. ఏపీకి చెందిన ఈ కోచింగ్ నిర్వాహకుడు తెలంగాణలోని హైదరాబాద్ లో సాయి కోచింగ్ సంస్థ పేరిట నిర్వహించి నిరుద్యోగులను రెచ్చగొట్టాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారని వార్తలు వచ్చాయి. పలు కీలక విషయాలు రాబట్టినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఏపీ పల్నాడు జిల్లా ఎస్పీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని.. కేవలం విచారించామని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు తమనకు సంప్రదించలేదని చెప్పారు.

ఇక సుబ్బారావును ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారించారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో గాయపడి చికిత్స పొందుతున్న 9 మందిలో ఆరుగురిని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు డిశ్చార్జి చేశారు. మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసుల నో అబ్జెక్షన్ తర్వాతే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. డిశ్చార్జి అయిన వారి వివరాలను జీఆర్పీ పోలీసులు సేకరించారు.

సికింద్రాబాద్ లో విధ్వంసానికి కారణమైన 46 మందిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. అంతేకాదు.. రైల్వేస్టేషన్లలో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్సీ బాంబు పేల్చారు. రైల్వే కేసులలో శిక్ష పడ్డ వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. వారి జీవితం నాశనమైనట్టేనని స్పష్టం చేశారు.

రైల్వేస్టేషన్ పై దాడికి పాల్పడిన వారంతా తెలంగాణకు చెందిన నిరుద్యోగులేనని విచారణలో తేలింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఈ్టస్ట్ కోస్ట్, దానాపూర్, అజంతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు నిప్పు పెట్టారు. మొత్తం నాలుగు బోగీలను దగ్ధం చేశారు. 58 అద్దాలు పగులకొట్టారు.