Begin typing your search above and press return to search.
బాబు బండారాన్ని ఎస్వీ బయటపెట్టేశారే!
By: Tupaki Desk | 12 July 2017 7:19 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనపై మాయని మచ్చ పడిపోయింది. అదేదో ఏ విపక్ష పార్టీ నేతో - బాబు అంటే గిట్టని వారో వేసిన మచ్చ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే... బాబు మార్కు పాలన ఇదేనంటూ టీడీపీ పాలనపై మాయని మచ్చ వేసింది ఆ పార్టీకి చెందిన కీలక నేతే. ఆయనే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. అయినా... సొంత పార్టీ ప్రభుత్వంపై ఆయన అలాంటి మచ్చ ఎందుకు వేశారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చకు తెర లేచేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే... దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలోకి దిగిన భూమా... నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించారు.
ఆ తర్వాత ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు - అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు భూమా అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరిపోయారు. కొంత కాలానికి భూమా బావమరిది - కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తనను గెలిపించిన వైసీపీకి చేయిచ్చేసి గోడ దూకేశారు. అప్పటిదాకా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయించేసి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదంతా గతమైతే... నంద్యాల ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడకున్నా... ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను వినియోగిస్తోంది. ఎన్నడూ లేని విధంగా కేవలం పది రోజుల్లో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ఏకంగా రూ.300 కోట్లు విడుదల చేసింది.
ఇంకా ఎన్ని నిధులు కావాలో చెబితే... ఏమాత్రం ఆలోచించకుండానే నంద్యాల నేతలు కోరిన మేరకు నిధులు మంజూరు చేయాల్సిందేనని సీఎం హోదాలో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. అంటే... ఇప్పుడు నంద్యాల ప్రజలు అడిగిందే తడవుగా నిధులు విడుదలైపోతున్నాయి. గడచిన మూడేళ్లలో నంద్యాలలో మూడంటే మూడు కొత్త ఇళ్లు కూడా మంజూరు చేయని టీడీపీ ప్రభుత్వం ఉప ఎన్నికల నేపథ్యంలో ఏకంగా సింగిల్ ప్రకటనలోనే 13 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో మొన్న రాత్రి నంద్యాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి భూమా అఖిలప్రియతో పాటు, ఆమె మేనమామ అయి ఎస్వీ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నంద్యాల బైపోల్స్ టీడీపీ ఇన్ చార్జీ కేఈ ప్రభాకర్ - మంత్రి ఆదినారాయణరెడ్డి - నంద్యాల కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి తదితరులంతా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైకు అందుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి... ఉప ఎన్నికలు జరగనున్న నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి... తమ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగితే బాగుండునని పొరుగు నియోజకవర్గాల ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకోసం తమ ఎమ్మెల్యేలు కూడా పైకి పోతే బాగుండునని కూడా ప్రజలు అనుకుంటున్నారని కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎస్వీ కామెంట్లు ఇప్పుడు వైరల్ గానే మారిపోయాయి. ఉప ఎన్నికలు లేని నియోజకవర్గాల్లో అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కేవలం ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలపైనే దృష్టి సారిస్తున్నారని చెప్పేందుకు ఎస్వీ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.