Begin typing your search above and press return to search.

వీడియోలో ఉన్న‌ది నిత్యానందేన‌ట‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 9:25 AM GMT
వీడియోలో ఉన్న‌ది నిత్యానందేన‌ట‌!
X
వివాదాస్ప‌ద స్వామీజీ నిత్యానంద మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. 2011లో సంచ‌ల‌నం రేపిన నిత్యానంద‌, సినీ న‌టి రంజిత రాస‌లీల‌ల వీడియో వ్య‌వ‌హారంలో ఆయ‌న పేరు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కాలం ఆ సీడీలో ఉన్న‌ది తాను కాదని, వీడియో మార్ఫింగ్ చేశార‌ని వాదించిన నిత్యానంద‌స్వామికి ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఊహించ‌ని షాకిచ్చింది. దీంతో రాసలీలల సీడీలో తాను లేనంటూ మార్ఫింగ్ చేశారని సమర్థించుకుంటూ వచ్చిన నిత్యానందకు కష్టకాలం మొద‌లైన‌ట్ల‌య్యింది.

రాసలీలల సీడీలో ఉన్నది నిత్యానందస్వామి - బహుబాష నటి రంజిత అని డిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్థారించింది. 2011లో నిత్యానంద - రంజిత రాసలీలల సీడీని ఆయన వ‌ద్ద డ్రైవర్ గా ప‌నిచేసే లెనిన్ విడుదల చేశారు. ఆ సమ‌యంలో ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వీడియోను మార్ఫింగ్ చేశారని నిత్యానందస్వామి వాదించారు. ఇప్పటి వరకూ ఆ సీడీ విషయంలో నిత్యానందస్వామి ఇలాగే వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు త‌న‌కు అస‌లు లైంగిక ప‌టుత్వమే లేద‌ని సెల‌విచ్చిన స్వామి వారు ప‌రీక్ష‌ల‌కూ సిద్ధ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అదంతా అబ‌ద్ధ‌మ‌ని తేల్చింది.

తాజాగా రాసలీలల సీడీని క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ సీడీలో ఉన్నది నిత్యానందస్వామి, నటి రంజిత‌ అని ధ్రువీకరించింది. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కూ వీడియో మార్ఫింగ్ జ‌రిగింద‌ని న్యాయస్థానం ముందు వాద‌న‌లు వినిపిస్తున్న‌నిత్యానందస్వామికి ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌ని న్యాయనిపుణులు అంటున్నారు. అప్ప‌ట్లో మీడియాలో - సోషల్ మీడియాలో ఈ రాసలీలల వ్య‌వ‌హారం వైరల్ అయ్యింది. నిత్యానందస్వామి - రంజిత రాసలీలల వీడియో మీడియాలో ప్రసారం కావడంతో బెంగళూరు శివార్లలోని నిత్యానందస్వామి ఆశ్రమానికి వెళ్లే భక్తులు ఆందోళనకు దిగారు. బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ధ్యానపీఠం ఆశ్రమంతో పాటు కర్ణాటక - తమిళనాడులో నిత్యానందకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిత్యనంద కర్ణాటకను వదిలి వెళ్లిపోవాలని కన్నడ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

దీనికి నిత్యానంద కొందరు రాజకీయ నాయకులతో పాటు మరికొందరు ప్ర‌ముఖులు తనను రూ.100 కోట్లు ఇవ్వాలని బెదిరించారని అప్ప‌ట్లో ఆరోపించారు. వారు డిమాండ్ చేసిన‌ డబ్బు ఇవ్వలేద‌నే త‌న‌పై కుట్ర‌ చేశారని విమ‌ర్శించారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ఆయ‌న‌పై ప‌రువున‌ష్టం స‌హా అనేక కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు ఆయ‌న శిష్యురాలు ఆరతీరావ్ తనపై నిత్యానంద అత్యాచారం చేశారని కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ఆ కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు రాసలీలల సీడీలో ఉన్నది నిత్యానందస్వామి అని వెలుగు చూడటంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. ఇప్ప‌టికే ప‌లువురు స్వామీజీలు, బాబాలు జైలుబాట ప‌ట్ట‌డంతో నిత్యానంద‌కూ అదే గ‌తి ప‌డుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.