Begin typing your search above and press return to search.

జాతీయ గీతం ఎక్క‌డ వినిపించినా నిల‌బ‌డాలట‌

By:  Tupaki Desk   |   30 Oct 2017 5:36 AM GMT
జాతీయ గీతం ఎక్క‌డ వినిపించినా నిల‌బ‌డాలట‌
X
అవును! జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌.. వివాదంలోకి కూడా శ్రీపీఠం అధిప‌తి స్వామి ప‌రిపూర్ణానంద వేలు పెట్టారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఎక్క‌డ వివాదం అక్క‌డే ఉంటున్నారు. ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య కోమ‌ట్ల‌పై రాసిన పుస్త‌కం వివాదంలోనూ త‌ల‌దూర్చిన ప‌రిపూర్ణానంద గంట‌ల కొద్దీ టీవీల్లో కామెంట్లు కుమ్మ‌రించారు. తాజాగా ఆయ‌న జాతీయ గీతం వివాదంపైనా స్పందించారు. సినిమా హాళ్ల‌లో జాతీయ గీతం ప్ర‌సారం చేయాల‌ని, ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కులు లేచి నిల‌బ‌డాల‌ని గ‌తంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, నాలుగు రోజుల కింద‌ట ఈ తీర్పును స‌మీక్షించిన కోర్టు.. లేచి నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. దీనిపై న‌టుడు క‌మ‌ల్ స‌హా క్రికెట‌ర్లు సైతం త‌మ‌దైన అభిప్రాయాలు వెల్ల‌డించారు.

తాజాగా స్వామి ప‌రిపూర్ణానంద జాతీయ గీతం గురించి మాట్లాడుతూ.. ఈ గీతం నిద్ర‌లో వినిపించినా కూడా లేచి నిల‌బ‌డాల‌ని షాకింగ్ కామెంట్ చేశారు. విష‌యంలోకి వెళ్తే.. ‘జనగణమన’ అనేది పాట కాదు.. భారతమాత దాస్య సంకెళ్లు తెంచి - మనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ అని పరిపూర్ణానంద అన్నారు. ఆ గీతం నిద్రలో వినిపించినా కచ్చితంగా నిలబడాల్సిందే అన్నారు. గోదావరి పాలీమార్‌ నిర్వహణలో డా.సి.రాజేంద్రకుమార్‌ (రఘు) రచించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ గ్రంథావిష్కరణ సభ హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. దీనిని ఆవిష్క‌రించిన పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ.. గత అయిదు రోజులుగా సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలా.. అనే అంశంపై చర్చ జరుగుతోందన్నారు.

సినిమా హాలులోనే కాదు.. ఎక్కడ ఆ గీతం వినిపించినా కచ్చితంగా నిలబడాల్సిందే అన్నారు. కొందరు ఈ కులం వాళ్లు స్మగ్లర్లు - ఆ కులం వాళ్లు బందిపోట్లు అంటూ ప్రజల్లో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భగవద్గీత చనిపోయిన ప్రదేశంలో వినిపించేది కాదని.. ఎలా బతకాలో చెప్పిన గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథమన్నారు. మొత్తానికి ప‌రిపూర్ణానంద వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. ఇక‌, జ‌న‌గ‌ణ‌మ‌న‌పై ఇంకెవ‌రు ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.