Begin typing your search above and press return to search.

స‌న్యాసిని కాబ‌ట్టి బ‌హిష్క‌రించారు..చావ‌డానికైనా సిద్ధం

By:  Tupaki Desk   |   5 Sep 2018 4:00 AM GMT
స‌న్యాసిని కాబ‌ట్టి బ‌హిష్క‌రించారు..చావ‌డానికైనా సిద్ధం
X
తెలంగాణ‌లో ఓ వైపు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్న స‌మ‌యంలో మ‌రోవైపు మ‌త స‌మీక‌ర‌ణాలు సైతం జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించబడిన ఆయన కోర్టు తీర్పుతో మళ్లీ నగరంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. సన్యాసిని కాబట్టే బహిష్కరించారని స్వామి అన్నారు. ప్రజల గుండెల్లో బందీ అయిన తనను వారి నుంచి ఎవరూ దూరం చేయలేరని పరిపూర్ణనంద స్వామిజీ తెలిపారు. హుస్సేన్ సాగర్‌ లో బోట్లు తిరుగుతాయని - త్వరలో తెలంగాణలో ఓట్లు తిరగబోతున్నాయని అన్నారు. హైద‌రాబాద్‌లో హుస్సేన్ సాగర్ ఒక్కటే కాదు...తెలంగాణ ప్రజలను చూస్తే హిందూ సముద్రాన్ని చూస్తున్నట్టు ఉందని ఆయ‌న అన్నారు.

55రోజులు నన్ను తెలంగాణ నుండి బహిష్కరించారు...ఇప్పుడు ఇంకా తెలంగాణలోనే 55 సంవత్సరాలు ఉండటానికి వచ్చానని ప‌రిపూర్ణానంద తెలిపారు. త్వరలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతుంద‌న్నారు. హైదరాబాద్, సైబరాబాద్ - రాచకొండ పోలీసులు నన్ను నగర బహిష్కరణ చేయడం అక్రమమ‌ని, హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాష్టంలో ఉందన్నారు. హిందువులంతా ఐక్యం కావాలని కోరారు. లక్షలాది జనం కదిలివచ్చారని అన్నారు. గుండాలకు - దేశ ద్రోహులను బహిష్కరించాల్సింది త‌న‌ను బహిష్కరించారన్నారు. పాకిస్థాన్‌ లో కూడా ఇంత అరాచకం లేద‌ని ప‌రిపూర్ణ‌నంద అన్నారు. నన్ను 19 గంటలు కారులో తిప్పి నన్ను ఒంటరివాణ్ణి చేయాలని ప్రయత్నించారని, నన్ను బహిష్కరణ చేస్తారా మీరెవరైనా నన్ను బహిష్కరణ చేయాలని కోరుకున్నారా అని ప్ర‌శ్నించారు. త‌నను ఈ రాత్రి చంపేస్తే మీకోసం చావడానికైనా సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు.

తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే.. భాగ్యనగరానికి వచ్చానా? హిందూ మహా సముద్రంలోకి వచ్చానా అని అనిపిస్తోందని స్వామి ప‌రిపూర్ణ‌నంద‌ అన్నారు. నగర బహిష్కరణపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం చూస్తే.. హైకోర్టులో ధర్మానికి పెద్ద స్థానం ఉందని రుజువు అయిందని స్వామీజీ పేర్కొన్నారు. ధర్మం న్యాయస్థానంలోనే కాదు ప్రజలు - సమాజంలో కూడా ఉందని - దాన్ని ఎవరూ ఆపలేరు అనేది ఇవాళ మనకు తెలుస్తోందని స్వామీజీ అన్నారు. తాను తిరిగి హైదరాబాద్ రావాలని ఆకాంక్షించిన వారందరికి స్వామీజీ కృతజ్ఞతలు తెలియజేశారు.