Begin typing your search above and press return to search.

యోగికి పెద్ద షాకిచ్చిన మౌర్య

By:  Tupaki Desk   |   14 Jan 2022 9:51 AM GMT
యోగికి పెద్ద షాకిచ్చిన మౌర్య
X
ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు స్వామి ప్రసాద్ మౌర్య తన దెబ్బంటే రుచి చూపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఏమాత్రం ఊహించని బీజేపీ అగ్రనేతలు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మూడు రోజుల్లో మొత్తం ఎనిమిది మంది ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేశారు. వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.

మొదటగా స్వామి ప్రసాద్ మౌర్యతో రాజీనామాల పర్వం మొదలైంది. బీసీల్లో గట్టి పట్టున్న మౌర్యకు చాలాకాలంగా యోగితో పడటం లేదు. కారణాలు ఏవైనా కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు మౌర్య తన రాజీనామా సమర్పించారు. దాంతో బీజేపీకి మొదటి షాక్ తగిలింది. అక్కడి నుండి ప్రతిరోజు బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతునే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పటివరకు రాజీనామాలు చేసిందంతా మౌర్య మద్దతుదారులేనట.

స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్‌లోని పద్రౌనా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బహుజన్ సమాజ్ పార్టీతో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత చేరిన భారతీయ జనతా పార్టీలో చేరాడు. మౌర్య ఐదు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా, సభా నాయకుడిగా మరియు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అతను యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి మరియు కో-ఆర్డినేషన్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అతని కుమార్తె సంఘమిత్ర మౌర్య (బుదౌన్ నుండి ఎంపీ) 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మౌర్య తర్వాత తొందరలోనే మరికొంత మంది మంత్రులు, ఎంఎల్ఏలు కూడా రాజీనామాలు చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే రాజీనామాలు చేసిన వారిలో అత్యధికులు సమాజ్ వాది పార్టీలోకే వెళుతున్నారు. అంటే వీళ్ళందరు ఎస్పీ తరపునే పోటీ చేయబోతున్నట్లు అర్థమైపోతోంది. ఎన్నికలకు ముందు ఇంతమంది మంత్రులు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేయడం కచ్చితంగా బీజేపీ నేతలకు ఇబ్బందిగానే ఉంటుంది.

అయితే ఎస్పీ తరఫున పోటీ చేయబోయే వీళ్ళల్లో ఎంతమంది గెలుస్తారనేది చాలా ముఖ్యం. బీజేపీలో నుంచి ఎస్పీలోకి జంప్ చేసిన వాళ్ళంతా లేదా అత్యధికులు గెలిస్తే మాత్రం కమలం పార్టీకి ఇబ్బందనే చెప్పాలి. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఇలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మంత్రులు, ఎంఎల్ఏలు 28 మంది మారిపోయారు. అయితే వీరిలో అత్యధికులు ఓడిపోయారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.