Begin typing your search above and press return to search.

ఆయుర్వేదంతో కరోనాను కట్టడి చేస్తానన్న రాందేవ్

By:  Tupaki Desk   |   4 April 2020 2:00 PM GMT
ఆయుర్వేదంతో కరోనాను కట్టడి చేస్తానన్న రాందేవ్
X
ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోగా...మరికొన్ని దేశాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ ను అన్ని దేశాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం మనదేశంలోని శాస్త్రవేత్తలు కూడా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ప్రకటించారు. హరిద్వార్ లోని పతంజలి రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు శాస్త్రీయ చేసిన అనంతరం కరోనా వైరస్‌ నివారణకు ఒక ఆయుర్వేద మందును కనుగొన్నామని రాందేవ్ చెప్పారు.

అశ్వగంథ - జిలోయ్ - తులసి మొక్కల్లోని ఫైటో కెమికల్స్ ద్వారా కరోనాను నివారించి చికిత్స అందించవచ్చని చెప్పారు. యాంటీ మలేరియా డ్రగ్ అయిన హైడ్రో క్లోరోక్విన్ తో ఫైటో కెమికల్స్ ను కలిపి కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆయుష్ మంత్రిత్వ శాఖకు అందించామని చెప్పారు. వైరాలజీ అనే మెడికల్ జర్నల్ కు తమ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చామని కూడా తెలిపారు. మరోవైపు, కరోనాకు హైడ్రో క్లోరోక్విన్ - అజిత్రోమైసిన్ తో చెక్ పెట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు. అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో తమకు హైడ్రో క్లోరోక్విన్ ఆశాదీపంలా కనిపిస్తోందని ట్రంప్ అన్నారు. ఇదే సమయంలో రాందేవ్ హైడ్రో క్లోరోక్విన్ కు జతగా అశ్వగంధ - జిలోయ్ - తులసి లోని ఫైటో కెమికల్స్ కలిపితే కరోనాకు నివారణ - చికిత్స చేయవచ్చని చెప్పడం గమనార్హం.