Begin typing your search above and press return to search.

దిక్కుమాలిన ప్రభుత్వం అనటం ఏంటి స్వామి?

By:  Tupaki Desk   |   23 April 2015 4:27 AM GMT
దిక్కుమాలిన ప్రభుత్వం అనటం ఏంటి స్వామి?
X

బాబాలు, పీఠాధిపతులు అంటే భావోద్వేగాలకు అతీతంగా ఉంటారని, వారిలో క్షమాగుణం ఎక్కువ అని భావిస్తుంటాం. అయితే దానికి భిన్నంగా ఉండేవారు కూడా ఉంటారు. వారు అవకాశం దొరికితే తమ అక్కసును వెళ్లగక్కుకోవడంతో మందు ఉంటారు. కొందరు స్వామీజీలు ఇందులో ముందు ఉంటారు. విశాఖ శారధ పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఈ విధంగానే ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

భారతీయ సంస్కృతికి పునాదులు వేసి హిందూ మతోద్ధరణ కోసం పాటుపడుతున్న పీఠాలకు, పీఠాధిపతులకు మనుగడ లేకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్వరూపానందేంద్ర ఆరోపించారు. విశాఖలోని సత్యనారాయణపురంలో సీతారామకళ్యాణ మండపాన్ని దేవాదాయశాఖ స్వాదీనం చేసుకోవడంపై నిరసనలు జరుగుతున్నాయి. దీనికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడిన స్వరూపానందేంద్ర కొందరు నాయకుల ఒత్తిడి వల్లే ఈ విధంగా జరుగుతోందని మండిపడ్డారు. బ్రహ్మణుల పీఠాల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కళ్యాణమండపాన్ని పీఠానికి అప్పజెప్పేదాకా అన్నికులాలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పారు.

దేవాదాయశాఖకు భక్తుల కానుకల మీదే మక్కువ అని ఆరోపించారు. గోదావరి పుష్కరాల పనులలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. అవనిగడ్డలో ఆంజనేయస్వామి గుడిని కూల్చివేసిన ఉదంతం ఉందన్నారు. అంతటా అవినీతే ఉందని ఆరోపించారు.

గతంలో చంద్రబాబు ఎక్కువ కాలం అధికారంలో ఉండరు అని స్వరూపా నందేంద్రం విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.