Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రధాని.. లాజిక్ చెప్పి మరీ జోస్యం చెప్పిన స్వామీజీ!

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:10 AM GMT
రాహుల్ ప్రధాని.. లాజిక్ చెప్పి మరీ జోస్యం చెప్పిన స్వామీజీ!
X
చేతికి వచ్చిన ప్రధానమంత్రి పదవిని పట్టించుకోకుండా 'యువరాజు'లా వ్యవహరించిన రాహుల్ గాంధీ తగిన మూల్యం చెల్లిస్తున్నారంటూ కొందరు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. రాహుల్ ను పప్పు.. అమూల్ బేబీ లాంటి పదాలతో అతడి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించటంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రధాని పదవి మీద రాహుల్ కు పెద్దగా అనురక్తి ఉండదని.. అందుకోసం ఆయన ఏనాడు కసిగా పని చేసింది లేదన్న విషయాన్ని చెబుతుంటారు. అదే.. ఆయనకు పెద్ద మైనస్ గా మారటమే కాదు.. ఆయన్ను ఆ పదవికి అర్హుడన్న భావనను మెజార్టీ ప్రజల్లో కలగీయని పరిస్థితి ప్రస్తుతం ఉందన్న సంగతి తెలిసిందే.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రధాని పదవి మీద ఇటీవల కాలంలో మోజు పెంచుకున్న రాహుల్.. దాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశ అయితే ఉంది కానీ.. ఆ లక్ష్యాన్నిక్రాక్ చేయటానికి అవసరమైన సరంజామాను ఆయన సిద్దం చేసుకోలేకపోతున్నారన్న ప్రచారం నడుస్తోంది.

దానికి తోడు.. రాహుల్ తలపడుతున్నది మోడీ లాంటి మేరునగంతో అన్నది కూడా తెలిసిందే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ కు మరింత ఉత్సాహాన్ని కలిగించే మాట ఒకటి ఒక ప్రముఖ స్వామీజీ నోటి నుంచి వచ్చింది. ఆయన ప్రధానమంత్రి అవుతారంటూ కర్ణాటకకు చెందిన ఒక స్వామీజీ జోస్యం చెప్పారు.

మాట వరసకు కాకుండా లాజిక్ చెప్పి మరీ జోస్యం చెప్పిన ఆయన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ ను రాహుల్ గాంధీ సందర్శించిన సమయంలో స్వామీజీ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.

ఈ మఠాన్ని సందర్శించిన సందర్భంగా మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘ శరణరు నుంచి ఇష్టలింగ దీక్షను చేపట్టారు. సాధారణంగా ఇలాంటి దీక్షను లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే స్వీకరిస్తుంటారు. తాజాగా రాహుల్ కూడా ఈ దీక్షను చేపట్టటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. హవేరి హోసముట్ స్వామీజీ రాహుల్ గురించి జోస్యం చెబుతూ.. 'ఇందిరాగాంధీ ప్రధానిగా పని చేశారు. రాజీవ్ ప్రధాని అయ్యారు. రాహుల్ కూడా ప్రధాని అవుతారు. ఇప్పుడాయన లింగాయత్ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి ఆయన పీఎం అవుతారు' అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే స్వామీజీ మాటలకు అడ్డుపడిన మఠాధిపతి శివమూర్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ఇది రాజకీయ వేదిక కాదని.. ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొనటం గమనార్హం. మరి.. స్వామీజీ జోస్యం ఎంతవరకు రియాలిటీలోకి వస్తుందో చూడాలి.