Begin typing your search above and press return to search.

జనసేనతో పొలిటికల్ ఎంట్రీకి స్వామీజీ రెడీ...?

By:  Tupaki Desk   |   8 Aug 2022 12:30 PM GMT
జనసేనతో పొలిటికల్ ఎంట్రీకి స్వామీజీ రెడీ...?
X
ఆయన మాట్లాడితే భగవంతుడు గురించే చెబుతారు. భక్తులతో ఆధ్యాత్మిక చర్చలు జరుపుతారు. ఆయన హిందూ మతానికి కట్టుబడి ఉన్న ఒక ప్రముఖ పీఠాధిపతి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాగా తెలిసిన నలిగిన పేరు కలిగిన వారు. ఆయన హిందూ మత ప్రచారం ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఈ కారణంగానే ఆయన బీజేపీ వారికి కూడా చేరువ అయ్యారు. దాంతో ఆయనలో రాజకీయ భావనలు కూడా ఒక్కసారిగా పురి విప్పాయి. ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు.

తరచూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని కూడా కలుస్తూ ఉంటారు. అయితే ఆయనలో ఇపుడు రాజకీయాల మీద ఆసక్తి బాగా పెరిగిపోయింది. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా చట్ట సభలలో అడుగుపెట్టాలన్నది ఆయన దృఢ సంకల్పంగా ఉందిట. అందుకే ఆయన తనకు ఎక్కడ టికెట్ దక్కుతుంది అవకాశాలు ఎలా ఉంటాయి అన్నవాటి మీద బాగా ఆరా తీస్తున్నారు అని తెలుస్తోంది. ఈ స్వామిజీ కోస్తా జిల్లాలకు చెందిన వారు అని అంటున్నారు.

ఆయన పీఠానికి కూడా బాగానే పేరు ఉంది. ఆయన ప్రసంగాలకు జనాలు వెల్లువలా వస్తారు. మరి దాన్ని రాజకీయాలతో ముడి వేయాలని చూస్తున్నారు. ఆయనకు బాగా పరిచయం ఉన్న బీజేపీ టికెట్ ఇచ్చినా గెలిచే సీన్ అయితే లేదు. ఇక టీడీపీతో ఆయనకు పొసగదు అంటున్నారు. టీడీపీ ఏలుబడిలో ఈ స్వామీజీ ఆశ్రమానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెబుతారు. దాంతో వైసీపీలోకి వెళ్లాలనుకున్న అక్కడ అంతా కిక్కిరిసి ఉంది. దాంతో స్వామీజీ గారి లేటెస్ట్ చూపు జనసేన మీద స్టాండ్ అయింది అంటున్నారు.

ఏపీలో వైసీపీ టీడీపీలతో ధీటుగా ఎదుగుతున్న జనసేన నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగానో ఎమ్మెల్యేగానో చట్టసభలలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే జనసేనలో ఎలా తనకు ప్రవేశం లభిస్తుంది. టికెట్ ఎలా దక్కుతుంది అన్న దాని మీదనే ఆయన ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఈ స్వామీజీ గారికి బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. అలాగే ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలకు జనాల ఆకర్షణ కూడా మెండుగా ఉంది కాబట్టి ఇక టికెట్ వస్తే చాలు గెలుపునకు తిరుగులేదు అని ఆయన భావిస్తున్నారుట. అందుకే ఆయన టికెట్ వేటలో ఉన్నారని అంటున్నారు. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తామా అన్నది కూడా ఆయనకు కొన్ని సందేహాలు ఉన్నాయట. దాంతో తమ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఎమ్మెల్యే సీటును చూసుకుని జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవాలనుకుంటున్నారుట.

ఇక జనసేనకు స్వామీజీ ఆశ్రమం ఉన్న జిల్లాలలో మంచి బలం ఉందిపుడు. అలాగే ఇటీవల కాలంలో బాగా పుంజుకుంది కూడా. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని కూడా జనసేన చూస్తోంది. స్వామీజీ పాపులర్ ఫిగర్ కావడం, జనాదరణ ఉండడం, వెనక బలమైన సామాజికవర్గం ఉండడం, బీజేపీతో రిలేషన్స్ ఇవన్నీ చూస్తే కచ్చితంగా జనసేన నుంచి ఆయనకు టికెట్ దక్కుతుంది అని అంటున్నారు. అదే జరిగితే స్వామీజీ రాజకీయ అవతారం ఏ రకమైన రిజల్ట్ ని ఇస్తుందో చూడాల్సిందే.

అయినా సరే చక్కని మంచి మాటలను చెబుతూ భక్తితో జనాలను ఓలలాడించే స్వామీజీలు ఈ అబద్దల అసభ్య పద దూషణల రాజకీయాల్లో ఎలా మెలుగుతారో అన్నది కూడా చర్చగా ఉంది. అయితే రాజకెయ దురద అన్నది ఒక్కసారి పట్టుకుంటే వదిలేది మాత్రం కాదు. అందువల్ల స్వామీజీ అటో ఇటో అంటూ తన ఫేట్ ని తేల్చుకోబోతున్నారు. అది కూడా జనసేన మీదుగా జన నేత కావాలనుకుంటున్నారు. మరి ఆయన కష్టం ఇష్టం పండి ఫలించే సూచనలు ఉన్నాయా అంటే జవాబు కొరకు వెయిట్ చేసి చూడడమే.