Begin typing your search above and press return to search.

ఇద్దరు పెద్దల షాకింగ్ మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   21 July 2016 8:20 AM GMT
ఇద్దరు పెద్దల షాకింగ్ మాటలు విన్నారా?
X
ఇద్దరు పెద్దల షాకింగ్ మాటలు విన్నారా?

‘ఇంట్లో నల్లాలో నీళ్లు రావు. ట్యాంకర్ కోసం ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అంటారు’’

‘‘మా ఇంటికి ఫిల్టర్ బెడ్ అర కిలోమీటరే. కానీ.. నీళ్లు మాత్రం రావు’’

‘‘సెక్యూరిటీ కోసం షెడ్డు నిర్మించాల్సి ఉంది. రెండేళ్లు అయినా నిర్మించలేదు’’

‘‘ప్రహరీ గోడ కూలింది. ఇప్పటివరకూ పట్టించుకున్నది లేదు’’

‘‘లిఫ్ట్ లు పని చేయవు. రిపేర్లు చేయమంటే సాకులు చెబుతారే కానీ పని జరగదు’

ఇవన్నీ ఫిర్యాదులు. ఇలాంటివి హైదరాబాద్ నగరంలో బతికే సగటు జీవి నిత్యం చేసే కంఫ్లైంట్సే. కానీ.. మేం చెప్పినవి ఎవరో సామాన్యులు చెప్పినవి కాదు. తెలంగాణ రాష్ట్రంలో రెండు అత్యుత్తమ సభలకు పెద్దలుగా వ్యవహరిస్తున్న ఇద్దరు ప్రముఖులు చేసిన ఆవేదనకు అక్షరరూపం ఇది. అవును.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి.. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఇద్దరూ చెప్పిన మాటలు వింటే నోటి వెంట మాటలు రాని పరిస్థితి.

అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిన వీరి మాటలు విన్నప్పుడు ప్రముఖులకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా? అని ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రహరీ గోడ కూలి రెండేళ్లు అవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదంటూ కుండబద్ధలు కొట్టిన మాట.. అధికారుల పని తీరును చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.

సామాన్య ప్రజల మాదిరే మండలి ఛైర్మన్ నీళ్ల కోసం ఇన్ని తిప్పలు పడుతున్నారా? అని షాక్ తినాల్సిందే. తాను ఎదుర్కొంటున్న నీళ్ల సమస్యను ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘ఇంట్లో నల్లాలో నీళ్లు రావు. ట్యాంకర్ కోసం ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అంటారు. మా ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఫిల్టర్ బెడ్ ఉంది. అయినా నీళ్లకు కరువే. ఎన్నిసార్లు అధికారులతో చెప్పినా ఫలితం లేదు. నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల సంగతేంది?’’ అంటూ ప్రశ్నించారు.

వివిధ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో భేటీ అయినా అసెంబ్లీ స్పీకర్.. మండలి ఛైర్మన్లు తాము వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లిఫ్టు పని చేయటం లేదని.. రిపేర్లు చేయలేదంటే ఏదో ఒక సాకు చెబుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీ వెనుక ప్రహరీ గోడ కూలిపోతే ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని చెప్పిన స్పీకర్ మధుసూదనాచారి మాటలు విన్నప్పుడు అధికారుల పని తీరుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెబుతుందని చెప్పాలి. ఇద్దరు పెద్ద మనుషుల ఆవేదనపై తెలంగాణ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.