Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కు స్వామిగౌడ్ ఫజిల్ గా మారారా?

By:  Tupaki Desk   |   23 Aug 2020 5:30 PM GMT
గులాబీ బాస్ కు స్వామిగౌడ్ ఫజిల్ గా మారారా?
X
మరోసారి వార్తల్లోకి వచ్చారు మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్. సరిగ్గా మూడు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని పలువురిని ఆకర్షించాయి. తెలంగాణ అధికారపక్షంలో స్వామిగౌడ్ వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. కీలక పదవిని చేపట్టిన స్వామిగౌడ్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు అధికారపార్టీకి ఇబ్బందికరమన్న వాదన వినిపిస్తున్న వేళలో.. ఈ రోజు (ఆదివారం) ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.

ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసే ముందు.. మూడు రోజుల క్రితం స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యల్ని చూశాక.. ఇవాల్టి వ్యాఖ్యల్లోకి వస్తే కూసింత క్లారిటీ రావటం ఖాయం. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్గల్స్ లో శ్రీనారాయణగురు జయంతి వేడుకల్లో పాల్గొన్న స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ.. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.

కొన్ని కులాలే పరిపాలన.. ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. అధికారం కొంతమందికే పరిమితమైందని వ్యాఖ్యానించారు. రాజకీయాలు కుల ప్రాతిపదికన జరుగుతున్నాయని..కొన్ని కులాల వారు మాత్రమే పాలనా విభాగంలో ఉండి ప్రజల్ని పాలిస్తున్నారన్నారు. బడుగు.. బలహీన వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారితే.. ఈ రోజు అంతకు మించి అన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

ఈ రోజు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి స్వామిగౌడ్ తో పాటు.. ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ నోటి నుంచి అనూహ్య వ్యాఖ్యలు వచ్చాయి. రేవంత్ ను తెగ పొగిడేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనేమన్నారంటే.. ‘‘రేవంత్ పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా.. బడుగు వర్గాలకు చేతికర్రగా మారాడు. బడుగు.. బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలి. వారికి అండగా నిలవాలి. తెల్లబట్టల వారికి మనం అమ్ముడుపోవద్దు. రూ.2500 కోట్లు ఉన్న వ్యక్తిని నిలబెడితే.. రూ.3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోంది. ఒక పార్టీ పది మందిని చంపినోడిని నిలబెడితే.. మరోపార్టీ 15 మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోంది. ఇలాంటి రాజకీయాల్ని ప్రజలు గమనించాలి. చైతన్యం రావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. కొత్త రాజకీయాలకు రూపుదిద్దుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

స్వామిగౌడ్ తరహాలోనే ఆ మధ్యన రేవంత్ రెడ్డి నోటి నుంచి వ్యాఖ్యలు వచ్చేవి. తనను ఓడించేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని.. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓడించేందుకు అధికార పార్టీ కోట్లల్లో డబ్బు వెచ్చిందని మొదట్నించి వాదిస్తున్న రేవంత్ మాటలకు దన్నుగా నిలిచేలా స్వామిగౌడ్ తాజా వ్యాఖ్యలు రావటం గమనార్హం. శాసనమండలి ఛైర్మన్ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా.. ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. దీనికి తోడు.. టీఆర్ఎస్ అధినేత ఆయన్ను దగ్గరకు రానివ్వలేదన్న మాట వినిపిస్తోంది. ఈ పరిణామాలతో కలత చెందిన స్వామిగౌడ్ గుర్రుగా ఉన్నట్లు చెబుతారు.

ఈ నేపథ్యంలోనే ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన.. తప్పనిసరి పరిస్థితుల్లో తన నోటికి పని చెబుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వామిగౌడ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు.. గులాబీ బాస్ కు కొత్త ఫజిల్ గా మారాయని చెప్పక తప్పదు. ఓపక్క కొడుకు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. వారసత్వ రాజకీయాలు.. అగ్రకులాల చేతుల్లోనే అధికారం లాంటి భావనలు తెలంగాణ సమాజానికి వచ్చే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే స్వామిగౌడ్ లాంటి నేత నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరమని చెప్పక తప్పదు. అలా అని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు లాంటివి చేపడితే.. ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమన్న మాట రుజువవుతుంది. మరి.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పక తప్పదు.