Begin typing your search above and press return to search.

తెలంగాణ యోగి ప‌రిపూర్ణానంద‌?

By:  Tupaki Desk   |   8 Oct 2018 4:44 AM GMT
తెలంగాణ యోగి ప‌రిపూర్ణానంద‌?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోనుందా? త‌న ధార్మిక ప్ర‌సంగాల‌తో పెద్ద ఎత్తున అభిమానుల్ని సొంతం చేసుకొన్న స్వామి ప‌రిపూర్ణానంద రానున్న రోజుల్లో స‌రికొత్త పాత్ర‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే.. అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో యోగి ఆదిత్య‌నాథ్ పోషించే పాత్ర‌ను తెలంగాణ‌లో స్వామి ప‌రిపూర్ణాంద పోషించే అవ‌కాశం మొండుగా ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.తాజాగా ఆయ‌న‌కు ఢిల్లీ నుంచి క‌బురొచ్చింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆయ‌న్ను వెంట‌నే ఢిల్లీకి రావాల‌ని పిలిచిన‌ట్లుగా చెబుతున్నారు.

శ్రీ పీఠం అధిప‌తిగా సుప‌రిచితుడైన ఆయ‌నకు అమిత్ షా నుంచి పిలుపు రావ‌టం వెనుక రాజ‌కీయ సంచ‌ల‌నం ఒక‌టి చోటు చేసుకోనుంద‌న్న మాట రాజ‌కీయవ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. త్వ‌ర‌లో జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఆయ‌న పేరును ప్ర‌క‌టించే వీలు ఉందంటున్నారు. ఒక‌వేళ సీఎం అభ్య‌ర్థి కాకున్నా.. బీజేపీలో చేరి..ఎంపీగా పోటీ చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. స్వాములోరి మెడ‌లో కాషాయం కండువ ప‌డ‌టం ప‌క్కా అంటున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌తంలో తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే విష‌యం.. బీజేపీలో చేరే అంశం తాను పూజించే అమ్మ‌వారికి వ‌దిలేసిన‌ట్లుగా ఆయ‌న చెప్పేవారు. అధ్యాత్మిక బోధ‌న‌ల‌తో పాటు.. సామాజిక అంశాల మీద ఆయ‌న త‌ర‌చూ స్పందించేవారు. రెండు అంశాల విష‌యంలో ఆయ‌న బాగా హైలెట్ అయ్యారు. ఓయూ ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అన్న పుస్త‌కం సంద‌ర్భంగా.. ఐల‌య్య‌ను పెద్ద ఎత్తున త‌ప్పు ప‌ట్టారు.

ఇటీవ‌ల క‌త్తి మ‌హేశ్ శ్రీ‌రాముడ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. క‌త్తి వ్యాఖ్య‌ల‌పై ఆందోళ‌న దిశ‌గా అడుగులు వేశారు. దీంతో.. క‌త్తి మ‌హేశ్ తో పాటు.. స్వామి ప‌రిపూర్ణానంద‌పైనా హైద‌రాబాద్ పోలీసులు న‌గ‌రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. దీనిపై న్యాయ‌పోరాటం చేసిన స్వామికి అనుకూలంగా కోర్టు తీర్పు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా స్వామిని హైద‌రాబాద్ న‌గ‌రంలోకి సాద‌రంగా ఆహ్వానించే కార్య‌క్ర‌మం భారీగా నిర్వ‌హించారు. సంఘ్ ప‌రివార్‌.. బీజేపీలు రెండు ఈ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌టం మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్వామిని అర్జెంట్ గా హ‌స్తిన‌కు రావాల‌ని కోర‌టం చూస్తుంటే.. మోడీషాలు పెద్ద ప్లానే వేసి ఉంటార‌న్న అభిప్రాయాన్ని పలువురు వ్య‌క్తం చేస్తున్నారు.