Begin typing your search above and press return to search.

పోస్టులో స్వామివారి ప్ర‌సాదం.. ఏయే ఆల‌యాల నుంచో తెలుసా?

By:  Tupaki Desk   |   29 March 2021 12:30 AM GMT
పోస్టులో స్వామివారి ప్ర‌సాదం.. ఏయే ఆల‌యాల నుంచో తెలుసా?
X
త‌మ ఇష్ట‌దైవం ప్ర‌సాదాన్ని భ‌క్తులు ఎంత ప్రేమ‌తో స్వీక‌రిస్తారో అందరికీ తెలిసిందే. ఆల‌యానికి వెళ్తే.. స్వామి ప్ర‌సాదం తీసుకోకుండా క‌ద‌ల‌రు చాలా మంది. త‌ద్వారా.. స్వామి దీవెన‌లు త‌మ‌కు అందుతాయ‌ని న‌మ్ముతారు. అందుకే.. ప్రసాదానికి చాలా విశిష్ట‌త ఉంటుంది. అయితే.. ఎన్నో కార‌ణాల‌తో చాలా మంది ఆల‌యాల‌కు వెళ్ల‌లేక‌పోతుంటారు. అందులో దూరాభారం ప్ర‌ధాన‌మైంది. అయితే.. ఇలాంటి వారికోసం స్వామి ప్ర‌సాదాన్ని ఇంటికే చేర‌వేసేందుకు సిద్ధ‌మైంది తెలంగాణ దేవాదాయ శాఖ‌.

రాష్ట్రంలోని ప్ర‌ముఖ దేవాల‌యాల ప్ర‌సాదాల‌ను పోస్టు ద్వారా ఇంటికి చేర‌వేయ‌బోతోంది. దీనికి చేయాల్సింది ఏమంటే.. పోస్టాఫీస్ కు వెళ్లి, త‌మ‌కు ఏ ఆల‌యం నుంచి ప్ర‌సాదం కావాలో చెప్పి, వివ‌రాలు ఇస్తే స‌రిపోతుంది. నిర్ణీత స‌మ‌యంలో ప్ర‌సాదం మీ ఇంటికి చేరుతుంది.

అయితే.. ప్ర‌ధాన‌మైన ఆల‌యాల‌కు మాత్ర‌మే చోటు క‌ల్పించింది దేవాదాయ శాఖ‌. ఇందులో యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి, భ‌ద్రాచ‌లం సీతారామ‌చంద్ర‌స్వామి, వేముల‌వాడ రాజ‌న్న‌, బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి, కొండ‌గ‌ట్టు ఆంజనేయ‌స్వామి, సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళి, సికింద్రాబాద్ గ‌ణేస్‌, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌-పోచ‌మ్మ‌, క‌ర్మ‌న్ ఘాట్ ఆంజ‌నేయ స్వామి, కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ఆల‌యాల నుంచి మాత్ర‌మే ప్ర‌సాదం అందించే ఏర్పాట్లు చేసింది.

ఈ మేరకు దేవాదాయ శాఖ.. త‌పాలాశాఖ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కొంత కాలం నిల్వ ఉండే ర‌వ్వ పొడి ప్ర‌సాదం, డ్రైఫ్రూట్ ప్ర‌సాదాల‌ను మాత్ర‌మే పోస్టు ద్వారా పంపించ‌నున్నారు.