Begin typing your search above and press return to search.

మెట్రోలో...ఎల్ అండ్ టీ మాల్స్ విశేషాలు ఇవే!

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:40 AM GMT
మెట్రోలో...ఎల్ అండ్ టీ మాల్స్ విశేషాలు ఇవే!
X
దాదాపు ద‌శాబ్దంనాటి క‌ల నేడు సాకార‌మ‌వ‌బోతోంది. భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. మన దేశంలో ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు హైద‌రాబాద్ మెట్రో. దీని కోసం దాదాపు రూ.15వేల కోట్లు ఖ‌ర్చుచేశారు. ఈ మెట్రో ప్రాజెక్టును ఎల్ &టీ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి దేశంలోని మిగిలిన మెట్రోల కంటే ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దింది. ఎక్క‌డా ఖ‌ర్చుకు వెర‌వ‌కుండా అత్యాధునిక విధానంలో దీనిని ఏర్పాటు చేసింది. అయితే పెట్టుబ‌డులు రాబ‌ట్టుకోవ‌డం కేవలం మెట్రో ఛార్జీల ద్వారానే సాధ్యంకాద‌ని భావించిన ఎల్&టీ సంస్థ మెట్రో స్టేషన్ల పరిధిలో మాల్స్ నిర్మాణం చేపట్టింది.

హైద‌రాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డు పంజాగుట్ట - ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్స్ మధ్య రెండు షాపింగ్ మాల్స్ ను ఎల్&టీ ఏర్పాటు చేసింది. ఈ రెండు మాల్స్ లో దాదాపు 12 సినిమా థియేట‌ర్స్‌ ఉన్నాయి. వీటితో పాటు ఈ మాల్స్ లో ప్రముఖ కంపెనీల షోరూములు కొలువుదీర‌నున్నాయి. వ‌చ్చే నెల‌లోనే ఈ రెండు మాల్స్ ను ఎల్&టీ ప్రారంభించాల‌ని భావిస్తోంద‌ట‌. డిసెంబర్ చివరిలోగా వీటి సేవలు అందుబాటులోకి రావచ్చ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. మెట్రో రైలు సేవ‌ల్ని ప్రారంభించాకే మాల్స్ ప్రారంభానికి ఎల్&టీ కంపెనీకి అనుమతినిచ్చారు. మంగళవారం మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుండటంతో వీలైనంత త్వరలో వీటిని ప్రారంభించే అవకాశముంది.

పంజాగుట్టలో గతంలో 'పడవ స్కూల్' ఉన్న ప్రాంతంలో ఎల్&టీ అత్యాధునిక‌ సాంకేతిక స‌దుపాయాలు - హంగులతో మాల్ నిర్మించింది. దీనితో పాటు ఎర్రమంజిల్ మెట్రో మాల్ కూడా అత్యంత ఆధునిక ప‌ద్ధ‌తుల్లో నిర్మించారు. వీటితో పాటు హైటెక్ సిటీ - మూసారంబాగ్ ప్రాంతాల్లోని మెట్రో మాల్స్ నిర్మాణం పూర్తికావ‌చ్చాయి. ఎల్&టీ సంస్థ నిర్మిస్తున్న మెట్రో మాల్స్ ద్వారా ఆ కంపెనీకి దాదాపు 45శాతం ఆదాయం సమకూరనున్నట్టు స‌మాచారం. వీటికి సమీపంలోనే మెట్రో స్టేషన్లు ఉండటం వ‌ల్ల మాల్స్‌కు అధిక‌ ప్రజాదరణ ఉంటుందని భావిస్తున్నారు. హైద‌రాబాద్ నగరంలో ఎల్&టీ నిర్మించిన‌ అన్ని మాల్స్ విస్తీర్ణం 60 లక్షల చదరపు అడుగులు కాగా.. రాయదుర్గం ద‌గ్గ‌ర నిర్మించిన‌ హైటెక్ సిటీ మాల్ ఒక్క‌టే 15ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడం విశేషం. అయితే నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు నిర్మాణం పూర్తయిన తర్వాతే ఈ మాల్ అందుబాటులోకి రావచ్చని స‌మాచారం.