Begin typing your search above and press return to search.

అలా చేస్తే దేశంలో జైల్లు సరిపోవు: నటి

By:  Tupaki Desk   |   3 Sep 2018 10:47 AM GMT
అలా చేస్తే దేశంలో జైల్లు సరిపోవు: నటి
X
ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ తాజాగా మహారాష్ట్ర పోలీసులు తెలుగు విరసం నేత వరవరరావుతో పాటు మరో నలుగురు మానవ హక్కుల నేతలను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. వీరి అరెస్ట్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయమై బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ వివేక్‌ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందిస్తూ - ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడం జరిగింది. తాను అర్బన్‌ నక్సలైట్లను సమర్ధించే వారి జాబితా తయారు చేయాలనుకుంటున్నాను, అందుకోసం చురుకైన యువత కావాలి - ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించండి అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది.

వివేక్‌ ట్వీట్‌ కు నటి స్వర భాస్కర్‌ విభిన్నంగా స్పందించారు. అర్బన్‌ నక్కలైట్లను తాను చూశాను - వారు టీవీ చర్చల్లో పాల్గొంటారు - పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ల్లో ఉంటారు అంటూ ఫన్నీ కామెంట్‌ చేసింది. ఇంకా స్వర భాస్కర్‌ మాట్లాడుతూ వరవరరావుతో పాటు హక్కుల నేతలను అరెస్ట్‌ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రజలు ఏదైనా తప్పు చేస్తేనే శిక్షించగలరని - వారి ఆలోచనను శిక్షించలేరు. ఒక వేళ ఆలోచనకు శిక్షించాలని భావిస్తే దేశంలో ఉన్న జైల్లు మొత్తం కూడా సరిపోవు అంటూ చెప్పుకొచ్చింది.

గాంధీజీని చంపేసిన వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. వారిని అరెస్ట్‌ చేసే దమ్ము మీకు ఉందా అంటూ స్వర భాస్కర్‌ ప్రశ్నించారు. గాంధీజీ చనిపోయిన సమయంలో వారు పార్టీ చేసుకున్నారు. ప్రజల హక్కుల కోసం పోరడుతున్న వారిని కుట్ర పూరితంగా అరెస్ట్‌ చేయడం - వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది అప్రజాస్వామ్య చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని హత్యకు వారు కుట్ర పన్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అలా ప్రభుత్వం భావించడం విడ్డూరంగా అనిపిస్తుందని స్వరా భాస్కర్‌ పేర్కొంది. బాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ప్రస్తుతం స్వరా భాస్కర్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.