Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను నేనే సీఎం చేశా!

By:  Tupaki Desk   |   18 Feb 2019 7:14 AM GMT
కేసీఆర్ ను నేనే సీఎం చేశా!
X
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెల్సిందే. అత్యధిక స్థానాలను టీఆర్ ఎస్ కైవసం చేసుకొని రెండోసారి సీఎం కేసీఆర్ ప్రమాణం స్వీకారం చేశారు. కాగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవడానికి కారణం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు - కాంగ్రెస్ పార్టీ అనైక్యత - తెలంగాణలో చంద్రబాబు నాయుడి ప్రచారం అని ఎవరినీ అడిగినా చెబుతారు. ఇందుకు భిన్నంగా ఓ స్వామీజీ స్పందించారు. ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తానే కారణమని చెప్పారు. తాను దగ్గరుండి కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేసినందు వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏపీలో చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీలోని టీటీడీ పాలన లోపభూయిష్టంగా మారిందని స్వామీజీ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకున్న పాపానా పోలేదని వీటన్నింటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన విషయాలు వెల్లడించారు. వీటన్నింటిని త్వరలోనే మీడియా ఎదుట ప్రవేశ పెడుతానని స్పష్టం చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పడిపోయేందుకు త్వరలోనే మరో రాజశ్యామల యాగం చేయబోతున్నట్లు ప్రకటించారు. తన యాగం వల్ల చంద్రబాబు నాయుడు అధికారానికి దూరమవడం ఖాయమని స్వామీజీ స్పష్టం చేశారు.

స్వామీజీ మాటలు సంచలనంగా మారుతున్నాయి. కేసీఆర్ కు దైవభక్తి ఎక్కువ. ఆయన ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం కూడా యాగాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం యాగాల వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . కేవలం యాగాలను చూసే కేసీఆర్ కు ప్రజలు ఓటేశారా? కేసీఆర్ పాలన చూసి కాదా అనేది స్వామీజీని కొందరు టీఆర్ఎస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని గద్దెదించేందుకు యాగం చేస్తాను అని స్వామి స్వరూపానంద ప్రకటించడం కలకలం రేపుతోంది. చంద్రబాబు నాయుడికి కేసీఆర్ తో పోలిస్తే కొంత దైవభక్తి తక్కువే. బాబు యాగాలు చేసిన దాఖలాలు కూడా లేవు. స్వరూపానంద యాగం చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటమి పాలవుతారా? అనేది అనుమానంగా మారింది.. ఒకవేళ ఇదే నిజమయితే అందరూ ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలు ప్రకటించే బదులుగా స్వామిజీ చుట్టూ తిరుగుతూ యాగాలు చేసుకుంటే సరిపోతుంది కాదా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఏదిఏమైనా స్వామీజీ ‘సీఎంలను చేస్తాను’ అన్న మాటలు వైరల్ గా మారుతున్నాయి. దీనిపై కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరీ..