Begin typing your search above and press return to search.

ఉదయం 11 గంటలు..1100 మంది అతిధుల మధ్యన ప్రమాణస్వీకారం

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:40 AM GMT
ఉదయం 11 గంటలు..1100 మంది అతిధుల మధ్యన ప్రమాణస్వీకారం
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపికైన తొలి మహిళా గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు (ఆదివారం) బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక మహిళకు అత్యున్నత పదవి దక్కింది లేదు. మంత్రిమండలిలోనూ మహిళకు అవకాశం లభించలేదు. ఇలాంటివేళ.. గవర్నర్ గా ఒక బీసీ మహిళకు అవకాశం ఇవ్వటం ద్వారా మోడీషాలు తిరుగులేని ఎత్తును వేశారన్న అభిప్రాయం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండుసార్లకు మహిళలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లభించని వేళ.. అందుకు భిన్నంగా ఆ లోటును తాము తీర్చామన్న సంకేతాల్ని ఇచ్చేందుకు తమిళిసై ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తమిళిసై ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

గవర్నర్ అధికార నివాసమైన రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని భారీగా.. వీలైనంత గ్రాండ్ గా చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దాదాపు 1100 మంది అతిధులకు ఆహ్వానాలు అందాయి. ఎంట్రీనే గ్రాండ్ గా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికి తమిళిసై ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాజ్యాంగపరమైన పదవుల్ని.. ప్రత్యక్ష.. పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికై ప్రమాణ స్వీకారోత్సవం చేసింది లేదు. ఈ రోజు అందుకు భిన్నంగా తొలిసారి ఆమె ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నారు. రాజకీయ నేపథ్యం నుంచి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె తీరు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. తమిళిసై ఏం చేస్తారో చూడాలి.