Begin typing your search above and press return to search.

స్విగ్గీ, జొమాటో ప‌ని అయిపోతుందా?

By:  Tupaki Desk   |   28 May 2021 2:30 AM GMT
స్విగ్గీ, జొమాటో ప‌ని అయిపోతుందా?
X
న‌గ‌రంలో ఏ మూల కూర్చున్నా స‌రే.. ఒక్క క్లిక్ తో భోజ‌నం ఇంటికి రావ‌డం అనేది జ‌నాల‌కు ఎంతో న‌చ్చింది. ఉన్న‌ఫ‌లంగా బిర్యానీ మీద‌కు మ‌నసు వెళ్తే.. రెస్టారెంట్ కు వెళ్ల‌డం, లేదంటే ఇంట్లో వండుకోవ‌డం ఎలా కుదురుతుంది? అంతేకాకుండా.. అవ‌స‌రాల్లో ఉన్న‌వారికి కూడా వండుకునే బాధ‌ను త‌ప్పిస్తుండ‌డంతో జ‌నాలంతా ఫాస్ట్ గా ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ల‌ను ఓన్ చేసుకున్నారు.

దీంతో.. స్విగ్గీ, జొమాటో సంస్థ‌లు అన‌తికాలంలోనే ఎంతో ఫేమ‌స్ అయ్యాయి. అయితే.. అంతా బాగానే ఉందిగానీ ఒక్క‌టే కంప్లైంట్‌.. ఛార్జీల పేరుతో భారీగా వ‌సూళ్లు చేస్తున్నాయ‌న్న‌దే ఆ ఫిర్యాదు! రెస్టారెంట్ల ద‌గ్గ‌ర నుంచి ఈ సంస్థ‌లు 30 శాతం మేర క‌మీష‌న్ వ‌సూలు చేస్తున్నాయ‌ట‌. అంతేకాకుండా.. స‌ర్వీస్ ఛార్జీలు, డెలివ‌రీ ఛార్జీల పేరుతో గ‌ట్టిగానే పిండేస్తున్నాయి.

ఈ విష‌య‌మై రెస్టార్టెంట్లు, హోట‌ళ్లు ఎంతో కాలంగా మ‌ద‌న‌ప‌డుతున్నాయి. ఇటు త‌యారు చేసే త‌మ‌కు మిగ‌ల‌క‌.. అటు కొనుగోలు చేసే వినియోగ‌దారుడికి లాభం లేక‌.. మ‌ధ్య‌లో డెలివ‌రీ చేసే సంస్థ‌ల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బులు ముట్ట‌జెప్పాల్సి రావ‌డంపై ఆవేద‌న‌గా ఉన్నాయి. కానీ.. అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇన్నాళ్లూ మిన్న‌కుండిపోయాయి. అయితే.. ఇప్పుడు దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాయి రెస్టారెంట్లు.

ఈ మేర‌కు త‌మ సొంత ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల‌ను క్రియేట్ చేసుకోవాల‌ని చూస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రెస్టారెంట్లు ఇప్ప‌టికే.. డాట్ పే, థ్రైవ్ వంటి కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కూడా ముమ్మ‌రం చేశాయి. త్వ‌ర‌లోనే ఈ విధానం అమ‌ల్లోకి రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. స్విగ్గీ, జొమాటోకు చెక్ ప‌డిన‌ట్టే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.