Begin typing your search above and press return to search.

మహమ్మారి ఎఫెక్ట్..నిరుద్యోగులుగా మారిన 6 కోట్ల మంది!

By:  Tupaki Desk   |   21 May 2020 6:00 AM GMT
మహమ్మారి ఎఫెక్ట్..నిరుద్యోగులుగా మారిన 6 కోట్ల మంది!
X
మహమ్మారి వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ఆ తరువాత కొంచెం కొంచెం పెరుగుతూ మొత్తం ప్రపంచానికి పాకిపోయింది. మన దేశంలో కూడా ఈ మహమ్మారి కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 5,609 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,359 కేసులకు చేరుకున్నాయి. 45,299 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,625కు చేరుకున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 50 లక్షలు దాటిపోయింది.

ఇలా ఒకవైపు మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా ఈ మహమ్మారి ప్రపంచానికే కాదు.. ఉద్యోగులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. మహమ్మారి దెబ్బతో దేశంలో ఆరు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తేలింది. ఇందులో 1.3 కోట్ల మంది 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారు కాగా... అలాగే 1.4 కోట్లమంది 25 ఏళ్ల నుండి 29 ఏళ్ల లోపు వారు...అలాగే 3.3 కోట్ల మంది 30 ఏళ్లకు పైబడిన వారిని కంపెనీలు తొలగిస్తున్నా యి. దేశవ్యాప్తంగా గత నెలలో నిరుద్యోగిత 23. 52 కాగా మే 19 నాటి లెక్కల ప్రకారం ఈ ఏడాది నిరుద్యోగ రేటు 23.8 0 గా ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ మహమ్మారి త్వరలో మరింత మందిని రోడ్డు పాలు చేయనుందట.

ఈ లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు సగం జీతం చెల్లిస్తున్నాయి. వారం క్రిత‌మే ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిపై వేటు వేయాలని నిర్ణయించింది.మిగితా ఉద్యోగుల‌పై సుమారు 50 శాతం జీతం కోత విధించింది. అలాగే తాజాగా మరో ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గి కూడా ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుమారు 1100 మంది ఉద్యోగులను కొన్ని రోజుల పాటు దూరంగా పెట్ట‌నున్న‌ట్లు తెలిపింది.