Begin typing your search above and press return to search.

స్విస్ బ‌య‌ట‌పెట్టిన పొట్లూరి రాజ‌మోహ‌న్ రావు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   3 Jun 2019 10:31 AM GMT
స్విస్ బ‌య‌ట‌పెట్టిన పొట్లూరి రాజ‌మోహ‌న్ రావు ఎవ‌రు?
X
న‌ల్ల‌ధ‌నం అన్నంత‌నే స్విట్జ‌ర్లాండ్ గుర్తుకు వ‌స్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప‌న్ను ఎగ‌వేసిన బ్లాక్ మ‌నీని సేఫ్ గా దాచుకునే దేశాల్లో స్విస్ అత్యంత సుర‌క్షిత‌మైన ప్రాంతంగా చెప్ప‌టం తెలిసిందే. భార‌తీయ కుబేరులు ప‌లువురు వేలాది కోట్ల బ్లాక్ మ‌నీని స్విస్ త‌దిత‌ర దేశాల్లో దాచుకున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తూ.. తాను దేశ ప్ర‌ధానిని అయిన వెంట‌నే ఆ డ‌బ్బును తిరిగి భార‌త్ కు తీసుకొస్తాన‌ని.. దేశ ప్ర‌జ‌ల బ్యాంక్ అకౌంట్ల‌లో వేస్తాన‌ని చెప్ప‌టం తెలిసిందే.

ఐదేళ్ల మొద‌టి ట‌ర్మ్ లో ఒక్క రూపాయి న‌ల్ల‌ధ‌నాన్ని భార‌త్ కు తీసుకొచ్చి జాతి జ‌నుల బ్యాంకు అకౌంట్ లో కాకున్నా.. ప్ర‌భుత్వ ఖ‌జానాలో వేసిన వైనం చూసింది లేదు. తాజాగా మ‌రో ఐదేళ్లు పాలించేందుకు ప‌గ్గాలు దేశ ప్ర‌జ‌లు ఇచ్చేయ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్విస్ ప్ర‌భుత్వం అప్పుడ‌ప్ప‌డు త‌మ ద‌గ్గ‌ర న‌ల్ల‌ధ‌నాన్ని దాచిన వారికి సంబంధించిన పేర్ల‌ను విడుద‌ల చేస్తుంటుంది. న‌ల్ల‌ధ‌నాన్ని తాము అంగీక‌రించ‌టం లేద‌ని.. చ‌ట్ట విరుద్ధ‌మైన న‌గ‌దు విష‌యంలో తాము సుద్ద‌పూస‌ల‌మ‌ని చెప్పే క్ర‌మంలో అప్పుడ‌ప్పుడు కొన్ని పేర్ల‌ను విడుద‌ల చేస్తుంటుంది.

తాజాగా అలాంటి ప‌నే చేసింది. అలా వ‌చ్చిన కొన్ని పేర్ల‌లో.. తెలుగువారి దృష్టిని ఆక‌ర్షిస్తున్న పేరు.. పొట్లూరి రాజ‌మోహ‌న్ రావు. తాజాగా కొన్ని పేర్ల‌ను ప్ర‌క‌టించిన స్విస్ ప్ర‌భుత్వం.. తొలుత వారికి నోటీసులు ఇచ్చి.. మీకు సంబంధించిన వివ‌రాలు మేం వెల్ల‌డించాల‌నుకుంటున్నాం.. మీకేమైనా అభ్యంత‌ర‌మా? అడుగుతోంది.

ఇలాంటి నోటీసులు అందుకున్న ప‌లువురు భార‌తీయుల్లో పొట్లూరి రాజ‌మోహ‌న్ రావు ఒక‌రు. పేరునుచూస్తుంటే అచ్చ తెలుగువాడిగా క‌నిపిస్తారు. మ‌రి.. ఆయ‌న ఎవ‌ర‌న్న దానికి ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌టం లేదు.

ఆయ‌న పేరు మీద ఉన్న కంపెనీలు చూస్తే.. అవ‌న్నీ ఉత్త‌రాదికి చెందిన‌విగా ఉన్నాయి. ఆయ‌న భాగ‌స్వామ్యుల్లో ఒక్క‌రు తెలుగు వారు లేక‌పోవ‌టం మ‌రో విశేషం. పైగా ఆయ‌న‌కున్న కంపెనీల్లో అత్య‌ధికం ఏపీలో రిజిస్ట‌ర్ అయిన‌వి కావు. అదే స‌మ‌యంలో పేరున్న కంపెనీలు కూడా కాక‌పోవ‌టం చూస్తుంటే.. ఇదంతా సూట్ కేసు కంపెనీల వ్య‌వ‌హార‌మ‌న్న సందేహానికి తావిచ్చేలా ఉంది.

పేరును మాత్ర‌మే ప్ర‌క‌టించిన స్విస్ స‌ర్కారుకు ద‌న్నుగా.. భార‌త ప్ర‌భుత్వం స‌ద‌రు వ్య‌క్తుల వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు వీలుగా వారి వ‌ద్ద స‌మాచారం ఉంటుంది. అలా ఉండి కూడా.. ఎందుకు మౌనంగా ఉన్న‌ట్లు? న‌ల్ల‌ధ‌నాన్ని దేశానికి తీసుకొచ్చి దేశ ప్ర‌జ‌ల అకౌంట్ల‌లో వేయ‌కున్నా ఫ‌ర్లేదు.. ఇలాంటి బ్లాక్ మ‌నీ అసాముల గుట్టుమ‌ట్ల‌ను బ‌య‌ట‌పెట్టేస్తే కేంద్ర స‌ర్కారు సొమ్మేం పోతుంది? స్విస్ ప్ర‌భుత్వం పేర్లు ప్ర‌క‌టించిన‌ప్పుడు.. కేంద్రం వారి వివ‌రాల్ని ప‌బ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి.. వారి వివ‌రాల‌న్ని బ‌య‌ట‌పెట్టేస్తే ఒక ప‌ని అయిపోతుంది క‌దా? ఆ ప‌ని ఎందుకు చేయ‌న‌ట్లు..? న‌ల్ల‌ధ‌నాన్ని దేశానికి తిరిగి తెచ్చే అంశం రాజ‌కీయంగా ఓట్ల‌ను తెచ్చి పెట్టేది మాత్ర‌మే కానీ.. మ‌రింకేమీ కాదా..?