Begin typing your search above and press return to search.

14న మూగబోనున్న మొబైల్స్ .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   7 Nov 2019 12:56 PM IST
14న మూగబోనున్న మొబైల్స్ .. ఎందుకంటే ?
X
ప్రస్తుతం కంప్యూటర్ యుగం అనే కంటే స్మార్ట్ ఫోన్స్ యుగం అని పిలిస్తే సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఆ మొబైల్స్ తోనే ముడిపడి ఉంది. అన్నం తినకుండా , చివరికి గాలి పీల్చకుండా కూడా ఉంటాం కానీ, మొబైల్స్ లేకుండా ఉండలేము అని అంటున్నారు. మొబైల్స్ వచ్చినప్పటి నుండి అందరూ దానికే బానిసలుగా మారిపోయారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండగా.. పక్కనున్న మనిషితో కూడా మనసు విప్పి మాట్లాడటం లేదు. బయట మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తరువాత పిల్లలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే ఉంటుంది. స్కూల్స్ నుండి వచ్చిన పిల్లలతో కూడా కాసేపు ప్రశాంతంగా మాట్లాడకుండా మొబైల్స్ తోనే గడిపేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్స్‌ను బంద్ చేయాలంటూ తెలిపింది. 14వ తేదీన సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో మాట్లాడాలని తెలిపింది. ఆ రోజంతా పిల్లలతోనే ఉండాలని, కనీసం వారంలో ఒకసారి ఫోన్లను పక్కనబెడితే మరింత బాగుంటుందని అభిప్రాయపడింది. పిల్లలతో తల్లిదండ్రులు మరింత సమయాన్ని గడిపేందుకు ఇదొక మంచి నిర్ణయమే.