Begin typing your search above and press return to search.

తమిళనాట దెబ్బ తిన్న బెబ్బులి అయ్యాడు

By:  Tupaki Desk   |   7 Dec 2017 7:44 AM GMT
తమిళనాట దెబ్బ తిన్న బెబ్బులి అయ్యాడు
X
ఏం జ‌రిగినా అది మ‌న మంచికే అని ఊరికే అన‌లేదేమో. త‌మిళ‌నాడులో తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయం చూస్తే ఈ మాటలో నిజం ఎంతో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ విష‌యంలో అధికార అన్నాడీఎంకే తొండాట ఇప్పుడా పార్టీకి శాపంగా మారింది. ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ప్ర‌ముఖ న‌టుడు విశాల్ నామినేష‌న్ చెల్లుబాటు కాకుండా ఉండేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

విశాల్‌ కున్న ఇమేజ్‌.. ఆయ‌న్ను దెబ్బేసేందుకు అన్నాడీఎంకే నేత‌లు నెరిపిన నిర్ల‌జ్జ రాజ‌కీయంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

విశాల్ నామినేష‌న్ ప‌త్రంలో త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని ఆరోపిస్తూ ఆయ‌న నామినేష‌న్ ప‌త్రాల్ని చెల్లుబాటు కాకుండా చేయ‌టంలో అన్నాడీఎంకే నేత‌లు స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ.. భారీ న‌ష్టం వాటిల్లింద‌న్న భావ‌న పెద్ద ఎత్తున వ్య‌క్త‌మ‌వుతోంది. విశాల్‌ ను ఉప ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పించేందుకే సినిమాటిక్ నాట‌కాన్ని ఆడిన అమ్మ పార్టీ నేత‌ల‌పై త‌మిళ‌నాడులో నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ఎపిసోడ్ ఎఫెక్ట్ తో ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయం ఎంతగా దిగ‌జారిపోయింద‌న్న విష‌యం విశాల్ ను దెబ్బేసే ఎపిసోడ్ చెప్ప‌క‌నే చెప్పేసింద‌న్న మండిపాటు ప‌లువురి నోట వినిపిస్తోంది. ప్ర‌స్తుతానికి విశాల్‌ కు దెబ్బ ప‌డినా.. రానున్న రోజుల్లో ఇది ఆయ‌న‌కు వ‌రంగా మారుతుంద‌ని చెబుతున్నారు. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న‌ట్లుగా విశాల్ ప్ర‌క‌టించిన‌ప్పుడు వ‌చ్చిన స్పంద‌న అంతంతే. ఎప్పుడైతే ఆయ‌న నామినేష‌న్ చెల్లుబాటు కాకుండా ఉండేందుకు అన్నాడీఎంకే నేత‌లు న‌డిపిన రాజ‌కీయాన్ని త‌మిళులు ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో విశాల్ పై సానుభూతి వెల్లువ‌లా మారింది. కుట్ర రాజ‌కీయాల‌కు బ‌లైన వ్య‌క్తిగా విశాల్‌ ను ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విశాల్ కు దెబ్బ ప‌డిన‌ప్ప‌టికీ.. వెల్లువెత్తిన సానుభూతితో మంచే జ‌రిగింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మిళుల మ‌దిలో సానుభూతి రిజిష్ట‌ర్ కావ‌టం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చ‌రిత్ర ఇప్ప‌టికే చెప్పేసింది. మ‌రోసారి దాని ప‌వ‌ర్ ఏమిటో తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉందంతే.