Begin typing your search above and press return to search.

రక్తంలో తడుస్తున్న బాల్యం

By:  Tupaki Desk   |   28 Feb 2018 4:23 PM GMT
రక్తంలో తడుస్తున్న బాల్యం
X
సిరియాలో చిన్నారుల పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు స్పందిస్తున్నారు. రక్తమోడుతున్న పాలబుగ్గల పసిపాపల చిత్రాలు మనసులను కదిలిస్తున్నాయి. ఒకప్పుడు సంక్షుభిత సిరియా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లే క్రమంలో పడవలో వెళ్తూ సముద్రంలో మునిగి ఒడ్డుకొట్టుకొచ్చిన చిన్నారి అలన్‌ కుర్దీ ఫొటో ప్రపంచ ప్రజలతో కన్నీరు పెట్టించింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అమాయకమైన చిన్నారులు కన్నీటితో - రక్తమోడుతున్న శరీరంతో కనిపిస్తున్న చిత్రాలు అందరి హృదయాలను బరువెక్కిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని వాస్తవ చిత్రాలైతే కొన్ని అసలు సిరియాకు సంబంధం లేనివి - మార్ఫింగ్ చేసినవి కూడా ఉంటున్నాయి.

సిరియా కొన్నాళ్లుగా యుద్ధక్షేత్రంగా మారడంతో ప్రజలు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే బతుకుతున్నారు. ప్రభుత్వ దళాలు - వేర్పాటువాద మిలిటెంట్లు - ఉగ్రవాద సంస్థల మధ్య నిత్యం జరుగుతూనే ఉంది. తుపాకుల తూటాలు - రాకెట్ లాంఛర్లు - గగనతలం నుంచే విరుచుకుపడే బాంబులు అక్కడి భవనాలను శిథిలాలుగా మారుస్తున్నాయి. ఆ శిథిలాల కింద వేల ప్రాణాలు నలిగిపోతున్నాయి.

సిరియాలో నరమేధం - సాగుతున్న హింసాకాండలో రక్తపు ముద్దలవుతున్న చిన్నారుల ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. ‘ప్రే ఫర్‌ సిరియా' అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. బాల్యాన్ని కాపాడాలని - మానవత్వాన్ని చూపాలని - ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న బాలల్లాగే అక్కడి చిన్నారులకు కూడా సంతోషంగా బతికే హక్కు కల్పించాలని కోరుతూ ఆన్ లైన్ వేదికగా ఈ ఉద్యమం నడుస్తోంది.

సిరియాలోని తూర్పు ఘౌటాలో ఉగ్రవాదులపై జరుపుతున్న దాడుల్లో కనీసం 700 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 200 మంది చిన్నారులు ఉన్నారు. యుద్ధ క్షేత్రంలో పౌరులకు ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేకుండా ఎడాపెడా జనావాసాలపై బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ఉగ్రవాదుల మాటేమో కానీ అమాయక జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.