Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని కదిలిస్తోన్న ఫోటో!

By:  Tupaki Desk   |   18 Aug 2016 5:56 PM GMT
ప్రపంచాన్ని కదిలిస్తోన్న ఫోటో!
X
ఆటలు ఆడుకోవాల్సిన చిట్టి చేతులు.. అక్కడ భయంతో వణికిపోతుంటాయి. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. తమ తప్పేం లేకున్నా.. నిత్యం నరకయాతన పడే చిన్నారుల్ని చూస్తే.. దేవుడి మీద కోపం రావటం ఖాయం. ప్రపంచంలో శాపగ్రస్త దేశాలుగా మారిన కొన్ని దేశాల్లో సిరియా ఒకటి. మతోన్మాదంతో మనిషి కాస్తా రాక్షసుడైతే ఏం జరుగుతుందో సిరియాను చూస్తే అర్థమవుతుంది.

ఉగ్రవాదుల కారణంగా సిరియా నుంచి వలస వెళుతున్న వారి పడవ సముద్రంలో మునిగిపోవటం.. ఓ చిన్నారి సముద్రపు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఘటనకు చెందిన ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించివేసింది. తాజాగా అలాంటిదే మరో ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది.

ఈ నెల 17న సిరియా రాజధానికి ఉత్తరాన ఉన్న నగరంలో తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లోఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ బిల్డింగ్ లో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని సిరియా సహాయక సిబ్బంది రక్షింది చికిత్స కోసం అంబులెన్స్ లో ఉంచారు. ఆ సమయంలో ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీశారు. దుమ్ము.. ధూళితో పాటు.. ఒళ్లంతా దెబ్బలు.. రక్తపు గాయాలతో చెదిరిన జుట్టు.. భయంతో బిగుసుకుపోయిన ఈ చిన్నారి ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించి వేస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్షికంగా దెబ్బ తిన్న భవనం నుంచి చిన్నారిని బయటకు తీసుకొచ్చిన గంట తర్వాత భవనం పూర్తిగా కూలిపోవటం గమనార్హం. మరోవైపు ఈ ఫోటోను చూస్తే.. మనిషిలోని మానవత్వాన్ని చంపేసిన మతోన్మాదాన్ని.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలన్న భావన కలుగుతుంది. సగటు మనిషికి కలిగే ఈ భావన ప్రపంచాన్ని ఏలే నేతలకు ఎందుకు కలగదు..?