Begin typing your search above and press return to search.

చేతిలో బిడ్డ..నడిసంద్రం. ఎంతకష్టం.ఎంతకష్టం..

By:  Tupaki Desk   |   14 Sep 2015 5:30 PM GMT
చేతిలో బిడ్డ..నడిసంద్రం. ఎంతకష్టం.ఎంతకష్టం..
X
సంక్షోభంలో చిక్కుకున్న సిరియాలో పౌరులు ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నారో ప్రపంచం చూస్తోంది. ఉన్న దేశాన్ని వీడి పరాయి దేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రాలు ఈదుతూ... ముళ్ల కంచెలు దాటుతూ... తుపాకీ గుళ్లను తప్పుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ప్రాణాలతో మిగిలేదెవరో.. పరలోకానికి పోయేదెవరో తెలియని పరిస్థితి. లక్షల్లో శరణార్థులు వస్తుండడంతో ఇతర దేశాలు కూడా గేట్లు మూసేయాల్సిన పరిస్థితి. ఇటీవల సిరియా నుంచి బోటులో వెళ్తూ ప్రమాదానికి గురయి పదుల సంఖ్యలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే సముద్రం తీరంలో ఉన్న చిన్నారి మృతదేహం ఫొటో ప్రపంచాన్ని కదిలించింది. ఆ ఫొటో చూశాక.. అంతవరకు మా దేశానికి రావద్దు అన్న దేశాలు కూడా సర్లెండి ఏం చేస్తాం అనాల్సివచ్చింది.

తాజాగా అలాంటి చిత్రమే ఇంకోటి ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. సిరియా నుంచి గ్రీస్ కు పడవలో వెళ్తుండగా ఓ పడవ నీటిలో మునిగిపోయింది. దాంతో... అందులో ఉన్నవారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అందులో ఓ వ్యక్తి తన చిన్నారి బిడ్డను చేతిలో పట్టుకుని ఈదుకుంటూ వెళ్లడం అందరినీ కదిలిస్తోంది. సిరియాలో కల్లోలాన్ని దాటడం కంటే కడలిని దాటడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తుంది.