Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుః ఉండ‌వ‌ల్లి మద్దతుగా టీ ఏసీబీ!

By:  Tupaki Desk   |   1 Nov 2016 7:28 AM GMT
ఓటుకు నోటుః ఉండ‌వ‌ల్లి మద్దతుగా టీ ఏసీబీ!
X
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించడం, దానిపై ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకోవడం, దీనిని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో ఈ కేసును నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప‌రిణామాలు మారిపోతున్నాయి. ఆళ్ల వేసిన పిటిష‌న్ నేప‌థ్యంలో హైకోర్టు న్యాయమూర్తి సునీల్‌ చౌదరి ఎదుట చంద్రబాబు తరఫు వాదనలు ముగిశాయి. హైకోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా త‌న వాద‌న‌లు వినిపిస్తూ 'ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీతిమంతుడు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు నుంచి పారిపోరు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు బాగా జరుగుతోంది. ఈ దశలో చంద్రబాబును వేధింపులకు గురిచేసేందుకే వైసీపీ ఎమ్మెల్యే ఏసీబీ కోర్టులో కేసు వేశారు. ఇది కక్షసాధింపు కేసు' అని వాదించారు. అయితే వాద‌న‌లు విన‌కుండానే తీర్పు ఇవ్వాల‌నే చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్య‌ర్థ‌నను కోర్టు అంగీక‌రించలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వాద‌న‌లు వినిపించే అవ‌కాశం క‌ల్పించింది.

చంద్ర‌బాబు త‌ర‌ఫున న్యాయ‌వాది సుదీర్ఘంగా వాద‌న‌లు వినిపిస్తూ క్రిమినల్‌ కేసులో సంబంధం ఉన్న వాళ్లు మాత్రమే న్యాయపరమైన కేసులు దాఖలు చేయవచ్చునని, కేసుతో సంబంధం లేని వ్యక్తులు కేసులు వేసేందుకు వీల్లేదని - ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా రూలింగ్‌ యిచ్చిందని వాదించారు. కేవలం చంద్రబాబును రాజకీయంగా వేధించేందుకే ఆళ్ల కేసు వేశారన్నారు. ఏసీబీ కోర్టులో సెక్షన్‌ సీఆర్‌ పీసీలోని 210 సెక్షన్‌ కింద కేసు వేశామని ఆళ్ల చెబుతున్నారని - అయితే ఏసీబీ కోర్టు సీఆర్‌ పీసీ సెక్షన్‌ 156 (3) ప్రకారం కేసు దర్యాప్తు జరిపి నివేదిక యివ్వాలని ఆదేశించిందని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. 156(3) సెక్షన్‌ కింద దర్యాప్తు జరిపి నివేదిక యివ్వాలంటే ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయాల్సిందే కదా అని ప్రశ్నించింది. ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే ఆ ఆదేశాల్ని సవాల్‌ చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందని సిద్ధార్థ బదులిచ్చారు. ఓటుకు నోటు కేసులో ఒకరిపై కేసును హైకోర్టు కొట్టేసిందని, ఈ దశలో కావాలని చంద్రబాబుపై కేసు వేశారని చెప్పారు. అదేవిధంగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేసును కూడా కొట్టేయాలని - విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదని - వాదనలు కూడా వినాల్సిన అవసరం లేదని చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాద‌ది తెలిపారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ..''ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ కు తన వాదనలు వినిపించే హక్కు ఉంది. వాదనలే వినడానికి వీల్లేదనడం స‌రికాద‌న్నారు. తన వాదన చెప్పుకునే హక్కు అరుణ్‌ కుమార్‌ కు ఉన్నందున ఆయ‌న‌ వాదనలు విన్నాకే కేసులో నిర్ణయాన్ని వెలిబుచ్చుతాం. చందబ్రాబు అప్పీల్‌ కేసులో నిర్ణయం వెలువరించాక అరుణ్‌ కుమార్‌ కేసు విచారిస్తాం''అని స్ప‌ష్టం చేసింది. ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ కేసులో తమ వాదనలతో కౌంటర్‌ వేస్తామని తెలంగాణ ఏసీబీ చెప్పింది. తమకు జారీ చేసే నోటీసుల్ని బట్టి కౌంటర్‌ వేస్తామని చంద్రబాబు న్యాయవాది చెప్పారు. సిద్థార్థ వాదనలు పూర్తి కావడంతో ఆళ్ల తరఫు వాదనల కోసం విచారణ నవంబర్‌ 7వ తేదీకి వాయిదాపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/