Begin typing your search above and press return to search.

అమిత్ 'షాక్' లేకుండా టీబీజేపీ జాగ్రత్తలు

By:  Tupaki Desk   |   17 Sep 2016 9:21 AM GMT
అమిత్ షాక్ లేకుండా టీబీజేపీ జాగ్రత్తలు
X
తెలంగాణ విమోచన దినం సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే... అమిత్ షా ప్రసంగం గతంలో ఇరుకునపెట్టిన నేపథ్యంలో ఈసారి తెలంగాణ బీజేపీ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అమిత్ షా నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పి వెళ్లిపోతే తరువాత తాము సమాధానం చెప్పలేక... విమర్శలను ఎదుర్కోలేక నానా బాధలు పడాలన్న ఉద్దేశంతో వారు అమిత్ షా ప్రసంగాన్ని జాగ్రత్తగా తయారుచేయిస్తున్నట్లు సమాచారం.

జూన్ లో సూర్యాపేట స‌భ‌కు హాజ‌రైన అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రానికి అందించిన సహాయంపై కాకి లెక్కలన్నీ చెప్పి వెళ్లిపోయారు. అప్పటి ఆయన ప్రసంగంలో చాలా త‌ప్పులు దొర్లడంతో ఆ పార్టీ నేత‌లు ఆత్మర‌క్షణ‌లో ప‌డ్డారు. ఈ విష‌యంలో అమిత్‌ షా ప్రసంగాన్ని రాష్ట్ర నేత‌లే త‌యారు చేశార‌ని అప్పట్లో ప్రచారం జ‌రిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమ‌ర్శించే విష‌యంలో అత్యుత్సాహానికి పోయిన తెలంగాణ బీజేపీ నేత‌లు వాస్తవాలను ప‌క్కన బెట్టి ఉన్నవి లేనివి క‌లిపి చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆ స‌మ‌యంలో వేదికపై ప్రసంగించిన అమిత్‌ షా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక్క‌డ కుటుంబ పాల‌న సాగుతోంద‌ని, కేంద్రం రూ.90 వేల కోట్లు ఇచ్చింద‌ని గొప్పలు చెప్పారు.

దాంతో కేంద్ర అన్ని నిధులు ఇస్తే అదంతా ఏమయిందన్న చర్చ మొదలైంది. దీనిపై తెలంగాణ ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ తీవ్రంగా స్పందించారు. రూ.90 వేల కోట్లు ఎప్పుడు - ఎక్కడ మంజూరు చేశారో లెక్కలు చూపాల‌ని కేంద్రానికి స‌వాలు విసిరారు. ఈ రెండు సంవత్సరాల్లో కేవలం 36 వేల కోట్లను మాత్రమే కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని గ‌ణాంకాలు చ‌దివి వినిపించారు. రాష్ట్రాలు కేంద్రానికి వేల కోట్ల నిధులు చెల్లిస్తున్నాయని రాష్ట్రాలు కేంద్రాన్ని భిక్షమెత్తుకోవని ఆయన అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్రం మోడీ మెచ్చుకుంటుంటే అమిత్‌ షా మాత్రం విమర్శలు చేయడం ద్వంద వైఖరికి నిదర్శనమని గట్టి ఆరోపణలు చేశారు. ఈటెల కౌంట‌ర్‌ తో అమిత్‌ షాకు ప‌రువు పోయినంత ప‌నైంది. ఈటెల మాట‌లకు తెలంగాణ బీజేపీ నేత‌లు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అప్పట్లా ఈసారి అడ్డంగా దొరికిపోకుండా, అబద్ధాలు చెప్పకుండా అమిత్ షా ప్రసంగాన్ని తయారు చేసినట్లు సమాచారం. అంతేకాదు... టీఆరెస్ తో కేంద్రంలో సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలోనూ విమర్శలు పెద్దగా ఉండవని తెలుస్తోంది.