Begin typing your search above and press return to search.

క‌ర‌ప‌త్రాల‌ను న‌మ్ముకుంటున్న ప్ర‌తిప‌క్ష‌పార్టీ

By:  Tupaki Desk   |   2 Jun 2016 12:52 PM GMT
క‌ర‌ప‌త్రాల‌ను న‌మ్ముకుంటున్న ప్ర‌తిప‌క్ష‌పార్టీ
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ త‌న కార్య‌చ‌ర‌ణ‌కు సిద్ధం చేసుకుంది. ఆవిర్భావ దినోత్స‌వ సంద‌ర్బంగానే ఈ మేర‌కు కొత్త కార్యాచ‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆవిర్భావం సంద‌ర్భంగా ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా త‌న‌దైన పంథాలో ప‌లు కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించింది. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామే అంటూ ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేతలు ప్ర‌క‌టించారు.

ఇదిలాఉండ‌గా కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధ‌మ‌యింది. గడిచిన రెండేళ్ళ కాలంలో సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...ప్రజలను మభ్య పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత‌లు మండిపడుతున్నారు.కేజీ టూ పీజీ ఉచిత విద్య - దళితులకు 3 ఎకరాల భూమి - దళిత సీఎం - డబుల్ బెడ్ రూం ఇళ్లు….ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. వీటిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు-అవి అమలవుతున్న తీరుపై ఊరువాడా కరపత్రాలు పంచాలని కాంగ్రెస్ నేత‌లు డిసైడయ్యారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళినా ప్రభుత్వానికి పట్టడం లేదని…. రైతుల ఆత్మహత్యలు - కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిర్ణ‌యించారు. రెండేళ్లలో జరిగిన ఎన్ కౌంటర్లు - ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులు - మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్ష కోట్ల అప్పుల్లో ఎందుకుందనే అంశాన్ని కరపత్రాల్లో ముద్రించ‌నున్నారు. మొత్తంగా ప్రభుత్వం సంబరాలతో బిజీగా ఉంటే సర్కార్ వైఫల్యాల పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత మేర‌కు ఫ‌లితం ఇస్తుందో చూడాలి మ‌రి.