Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌..కేసీఆర్‌ కు ఓ వ‌రం

By:  Tupaki Desk   |   11 July 2018 7:03 AM GMT
టీ కాంగ్రెస్‌..కేసీఆర్‌ కు ఓ వ‌రం
X
తెలంగాణా లోని ఆస‌క్త‌క‌ర‌మైన రాజ‌కీయానికి ఇదో నిద‌ర్శ‌నం. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు క‌లిసివ‌స్తున్న ఇంకా చెప్పాలంటే..ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న వ‌రం. అధికార టీఆర్‌ ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి ముందస్తు ఎన్నికలు వ‌చ్చేస్తున్నాయంటూ లీకులు ఇస్తూ ఇతర పార్టీల్లో గుబులు పుట్టిస్తుంటే...ప్రధాన ప్రతిపక్షంలో మాత్రం ఆ దూకుడు కనిపించటంలేదు. పైకి మాత్రం ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధమంటూ టీఆర్‌ ఎస్‌ కు కాంగ్రెస్‌ ప్రతిసవాల్‌ విసురుతోంది. వాస్తవానికి అందుకు సిద్ధంగా ఉన్నామంటూ గట్టిగా చెప్పలేకపోతున్నదని పార్టీ కేడర్ అంటోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న కాంగ్రెస్‌ లో నైరాశ్యం నెలకొంద‌ని - అంతర్గత కుమ్ములాటలతో కోలుకొలేకపోతున్నద‌ని...ఇంతకంటే కేసీఆర్‌కు ఇంకేం కావాల‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ బలోపేతం కోసం ఒక‌డుగు ముందుకు ప‌డితే దాన్ని అడ్డుకునేలా చేసిన చ‌ర్య‌ల‌తో ప‌ది అడుగులు వెన‌క్కు ప‌డ్డాయ‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు తాజాగా బ‌స్సు యాత్రే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. పార్టీని బలోపేతం కోసం ప్రజా చైతన్య యాత్రను చేపట్టేందుకు రూ. 50 లక్షలు వెచ్చించి కొత్త బస్సు కూడా కొనుగోలు చేసింది. ఇప్పటికే నాలుగు దఫాలుగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన రాష్ట్ర నాయకత్వం...ఐదో దఫా బస్సుయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించింది. యాత్ర సందర్భంగా 34 నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించింది. కొత్త బస్సు రావడంతో రాష్ట్ర మంతటా యాత్ర పూర్తి చేస్తారని పార్టీ నేతలు భావించారు. కానీ గాంధీభవన్‌ నుంచి బస్సు కదలడం లేదు. ఇందుకు పార్టీలోని లుక‌లుక‌లే కార‌ణ‌మంటున్నారు. ప్రజా చైతన్య యాత్రను ప్రారంభంలోనే సీనియర్లంతా వ్యతిరేకించారు. ఆ తర్వాత క్రమంలో యాత్రకు సహకరించినా...నామ్‌ కేవాస్తేగా మారింది. అంతకు ముందే పాదయాత్రలు చేస్తామంటూ టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క - గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ - కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి - నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి విన్నవించారు. పాదయాత్ర కోసం ఏ ఒక్కరికీ అవకాశం ఇచ్చినా...వారే ప్రజల నేతగా సుస్థిరస్ధానం సంపాదించుకుంటారనే ఉద్దేశంతో మరో గ్రూప్‌ అధిష్టానం వద్ద ఈ ప్రతిపాదనను ముందుకు కదలకుండా అడ్డుకుందని వినికిడి.

ఒకవైపు పార్టీ బస్సుయాత్రను అడ్డుకుంటే...మరోవైపు పాదయాత్రలకు అనుమతి రాకుండా మరో గ్రూప్‌ బ్రేక్‌ వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా నాయకత్వంలో సమన్వయం లేకపోవడంతో నాయకులు తమ కాళ్లకు తామే బంధం వేసుకుంటున్నారని గాంధీభవన్‌ లో వినిపిస్తోంది. అయితే, ఈ ప్రచారంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుకూల వర్గీయులు మ‌రో కోణంలో స్పందిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ రావడంతో బస్సుయాత్ర సక్సెస్‌ కాదన్న ఉద్దేశంతో బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. అయితే, పార్టీ అంతర్గత కుమ్ములాటలు - నాయకులు ఎడమొహం - పెడమొహంగా ఉండటంతో బస్సు చక్రాలు ముందుకు కదలడం లేదని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ఇలాంటి కుమ్ములాట‌ల కార‌ణంగా అధికార టీఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తుల్ని తిప్పికొట్టలేకపోతున్నామని ఆ పార్టీ వర్గీయులు ముక్త‌కంఠంతో చెప్తుండటం కొస‌మెరుపు.