Begin typing your search above and press return to search.

మల్లన్న సాగర్ .. టీ కాంగ్రెస్ ఆయువుపట్టు

By:  Tupaki Desk   |   12 Sep 2016 10:42 AM GMT
మల్లన్న సాగర్ .. టీ కాంగ్రెస్ ఆయువుపట్టు
X
అవకాశాలు రావు. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవటం తప్పనిసరి. తాజాగా అలాంటి వ్యూహంలోనే కనిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి షాక్ నుంచి తేరుకోవటానికి దాదాపు రెండేళ్లు పట్టిన ఆ పార్టీ ఇప్పుడు మాత్రం కాస్తంత దూకుడుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో కీలక భూమిక పోషించిన తమ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని అందిస్తారని ఆ పార్టీ నేతలు చాలానే కలలు కన్నారు. అయితే.. వారి ఆలోచనలకు భిన్నంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వటం తెలిసిందే.

బొటాబొటి మెజార్టీని సాధించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ చికాకు పెట్టటం ఖాయమని మొదట్లో అనుకున్నా.. కేసీఆర్ వ్యూహ చాతుర్యానికి కాంగ్రెస్ విలవిలలాడిన పరిస్థితి. తన ఆపరేషన్ ఆకర్ష్ తో మిగిలిన విపక్ష పార్టీలతో పాటు.. కాంగ్రెస్ పార్టీని సైతం ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ దెబ్బకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిందామీదా పడిన పరిస్థితి.

కేసీఆర్ కొట్టే దెబ్బలకు విలవిలలాడుతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఇష్యూ చేతికి వచ్చింది. దీంతో.. ఊహించని మైలేజీ రావటం.. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడటం ఆ పార్టీలో స్థైర్యాన్ని పెంచింది. కలిసి కట్టుగా ముందు కెళితే కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టటం పెద్ద కష్టమన్న భావనకు వచ్చిన కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ సర్కారుపై పోరుబాటకు సై అన్నారు. ఇలా మొదలైన వారి పోరాటం దశల వారీగా సాగుతోంది. ఈ మధ్యన పలు అంశాలు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో మల్లన్నసాగర్ అంశం కాస్త మరుగున పడినట్లైంది.

దీంతో కాంగ్రెస్ మల్లన్నసాగర్ వదిలేసిందన్న భావనకు వస్తున్న వేళ.. అలాంటిదేదీ లేదన్న చందంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరోసారి గళం విప్పారు. తాజాగా ఈ అంశంపై గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. బలవంతపు భూసేకరణతో నిర్వాసితులకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకొమ్మంటూ మండిపడుతూ వారు.. తమ వాదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మల్లన్నసాగర్ ఇష్యూలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తాము కోరినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ పేర్కొంటున్నారు. ముంపు గ్రామాల వారి కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెబుతున్న ఉత్తమ్ వెంట పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉండటం..వారంతా టీఆర్ ఎస్ మీద పోరుకు ఉత్సాహపడటం చూస్తే.. మల్లన్నసాగర్ ఇష్యూ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనటంలో సందేహం లేదనే చెప్పాలి.