Begin typing your search above and press return to search.

వాళ్లు నవ్వుల పాలయ్యేది ఇందుకే!

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:31 AM GMT
వాళ్లు నవ్వుల పాలయ్యేది ఇందుకే!
X
తెలంగాణ లో కేసీఆర్‌ ప్రభుత్వం అప్రతిహతంగా పాలన సాగిస్తోంది. అయితే కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకపోరాటాలను సాగించలేకపోతున్నాయని, విపక్షాలు బలహీనంగా ఉండడం అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద బలంగా ఉన్నదని జనంలో ఒక అభిప్రాయం ఉంది. పైగా విపక్షాల పోరాటాలు చాలా సందర్భాల్లో కామెడీగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ విమోచన దినం నిర్వహించడం గురించి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉద్యమస్థాయిలో మాట్లాడుతూ ఉండడం అనేది వారిని నవ్వుల పాలు చేసేవిధంగా ఉన్నదని పార్టీలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన సాగించింది. ఇప్పుడు డిమాండ్లు చేసే నాయకులందరూ అప్పుడు మంత్రి పదవులను వెలగబెట్టిన వారే! ఆ సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్లింది. అందులో భాగంగానే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెరాస కేసీఆర్‌ డిమాండ్‌ చేయడంకూడా జరిగింది. కానీ కాంగ్రెస్‌ సహజంగానే పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇప్పుడు కేసీఆర్‌ సర్కారు నడుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ అధికారికంగా విమోచనను నిర్వహించాలంటున్నారు. అయినా పదేళ్ల పాలనలో నామమాత్రంగా కూడా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు నిర్వహణ గురించి గొంతెత్తడం అంటే.. అవకాశవాదానికి పరాకాష్ట అని జనం నవ్వుకుంటున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా.. ఇలాంటి అవకాశ వాద విమర్శలే గనుక చేస్తూ వస్తే.. ప్రజల్లో టీపీసీసీకి ఇప్పుడున్న గౌరవం కూడా పోతుందని జనం అనుకుంటున్నారు.