Begin typing your search above and press return to search.

కారు ఎక్కేస్తున్నట్లు చెప్పేసిన గుత్తా..వివేక్.. వినోద్

By:  Tupaki Desk   |   13 Jun 2016 9:33 AM GMT
కారు ఎక్కేస్తున్నట్లు చెప్పేసిన గుత్తా..వివేక్.. వినోద్
X
అనుకున్నదే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. గత కొద్దిరోజులుగా షికార్లు చేస్తున్న అంశాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయి. తాము గులాబీ కారు ఎక్కేస్తున్న విషయాన్ని నల్గొంగ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. మాజీ ఎంపీ వివేక్ లు చెప్పేశారు. కారు ఎక్కే ముహుర్తాన్ని కూడా వారు చెప్పేశారు. ఈ నెల 15న టీఆర్ఎస్ లో చేరనున్న విషయాన్ని వెల్లడించారు.

సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా.. వివేక్.. వినోద్ లు మాట్లాడారు. తాము కాంగ్రెస్ ను వీడుతున్న విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ ను విడిచి పెట్టటం తమకు బాధగా ఉందన్న వారు.. సోనియాగాంధీని పొగుడుతూనే.. తెలంగాణ కాంగ్రెస్ లోని అంతర్గత విబేధాలు.. రాజకీయాలకు తాము విసిగిపోయినట్లుగా చెప్పారు. తెలంగాణలో తాము కోరుకున్న అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి చూపిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ లోని అంత:కలహాలతో మనో వేదనకు గురైనట్లుగా వెల్లడించిన వారు.. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కు తాము సంపూర్ణంగా మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించినట్లుగా గుత్తా పేర్కొంటే.. కేసీఆర్ పిలుపు మేరకు తాము పార్టీలో చేరనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వివేక్ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి గతంలో తాను తెలంగాణ అభివృద్ధి కోసం ఒక నివేదిక ఇచ్చానని.. అందులోని అంశాల్నే ఇప్పుడు కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చాలా చేశారని.. తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె తీసుకున్నారంటూ పొగిడేయటం గమనార్హం. పార్టీని వీడుతున్న ముగ్గురు నేతల మాటల్లోనూ సోనియాగాంధీ మీద అభిమానం వ్యక్తం కావటం గమనార్హం. అదే సమయంలో.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వంలోని లోపాల వల్లే తాము పార్టీ వీడుతున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. వీరి కారు ప్రయాణం కాంగ్రెస్ లో ఎలాంటి కలకలం రేపుతుందో చూడాలి.