Begin typing your search above and press return to search.

ఈ ఫోటోలోని నవ్వులు.. ఐక్యత టీ కాంగ్రెస్ లో ఎప్పటికి వచ్చేను?

By:  Tupaki Desk   |   17 Aug 2021 3:42 AM GMT
ఈ ఫోటోలోని నవ్వులు.. ఐక్యత టీ కాంగ్రెస్ లో ఎప్పటికి వచ్చేను?
X
కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను ఎప్పటికి అర్థం చేసుకోలేని పార్టీగా తెలంగాణ కాంగ్రెస్ ను చెప్పాలి. నిత్యం అధిపత్య పోరు కోసం అంతర్గతంగా సాగే కుమ్ములాటలు ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటాయి. ఎవరు నాయకత్వం వహించినా.. వారి నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకించటం.. వారికి సహకారం అందించకపోవటం లాంటి తీరుతో పార్టీని అంతకంతకూ బలహీనం చేసే వైనం టీ కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. చేతిలో అధికారం లేకున్నా.. పార్టీలో అధిక్యత కోసం ఆ పార్టీ నేతలు వ్యవహరించే తీరు.. కదిపే పావులు చూస్తే.. ఈ జన్మకు పార్టీ బాగుపడదా? అన్న సందేహాలు కలిగేలా పరిస్థితులున్నాయని చెప్పాలి.

ఈ మధ్యనే ఇంద్రవెల్లిలో రేవంత్ నిర్వహించిన భారీ సభకు పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టటం తెలిసిందే. అలాంటి నేతల్లో కొందరు తాజాగా హైదరాబాద్ లోని మధుయాష్కీ నివాసానికి వచ్చారు. నవ్వులు చిందించారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవన్నట్లుగా వ్యవహరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెలితే.. రాయచూర్ లోని జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి వెళుతూ హైదరాబాద్ లో ఆగారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కమ్ వర్కింట్ కమిటీ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా.

అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా విడిగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ ముగ్గురు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మదుయాష్కీ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. వీరిని కలిసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు వెళ్లారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. పొన్నాల.. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

నవ్వులు చిందిస్తూ.. విభేదాల్ని దాచి పెట్టేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు వచ్చినప్పుడు కనిపించే సామరస్యం.. ఐక్యత లాంటివి పార్టీలో సహజసిద్ధంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఫోటోలు తీసుకునేటప్పుడు ప్రదర్శించే ఐక్యత.. అధికారపక్షంపై పోరాడే విషయంలోనూ కనిపిస్తే ఎంత బాగుండన్న మాట పార్టీ నేతల నోటి నుంచి రావటం గమనార్హం