Begin typing your search above and press return to search.

జానాకు సీఎం అయ్యే ఛాన్స్ హుళ‌క్కేనా..!

By:  Tupaki Desk   |   28 July 2016 7:36 AM GMT
జానాకు సీఎం అయ్యే ఛాన్స్ హుళ‌క్కేనా..!
X
జాతీయ పార్టీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఎర్త్ పెట్టేందుకు వేరే ఎవ‌రో ఎక్క‌డి నుంచో రావాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య లొల్లి పెట్టే ప‌ని విప‌క్షాల‌కు కూడా అంత‌గా ఉండ‌దు. ఎందుకంటే... జాతీయ‌ వార‌స‌త్వ పార్టీ అయిన కాంగ్రెస్ నేత‌లే ఒక‌రి జుట్టుకు మ‌రొక‌రు ముడులు వేసేసుకుంటుంటారు. వారిలో వారే ఎక్కువగా అంత‌ర్గ‌తంగా.. కొన్నిసార్లు బ‌హిరంగంగా ఎర్తులు పెట్టేసుకుంటుంటారు. ఇప్పుడివ‌న్నీ ఎందుకంటున్నారా? అక్క‌డికే వ‌చ్చేద్దాం.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయిన కాంగ్రెస్‌.. తెలంగాణ‌లో గుడ్డిలో మెల్ల‌గా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆలు లేదు చూలు లేదు.. కొడుక్కి పేరు పెట్టిన‌ట్టు.. టీ తెలంగాణ నేత‌లు.. సీఎం సీటు విష‌యంలో అంత‌ర్గ‌తంగా త‌న్నుకు చ‌స్తున్నారు.

2019లో అధికారంలోకి వ‌స్తే.. సీఎం సీటు నాదే అనే నేత ఒక‌రైతే.. కాదు కాదు ఆయ‌నైతేనే బాగుంటుంద‌ని సిఫార్సులు చేసే నేత‌లు మ‌రికొంద‌రు. తెలంగాణ‌లో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ - మాజీ మంత్రి జానా రెడ్డి ఎప్పుడు ఎక్క‌డ అవ‌కాశం వ‌చ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తానే సీఎం అభ్య‌ర్థిన‌ని చెప్ప‌కుంటున్న విష‌యం తెలిసిందే.

అసలు కాంగ్రెస్ సిద్ధాంతం ప్ర‌కారం ఎన్నిక‌ల‌కు ముందు సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించే ఛాన్స్ లేదు. అయిన‌ప్ప‌టికీ.. జానా మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌కు ఎక్క‌డా ఫుల్‌ స్టాప్ పెట్ట‌డం లేదు. ఇప్పుడు ఈయ‌న‌కు క‌లిసొచ్చిన మ‌రో అంశం ఏంటంటే.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాదాపు 8 నెల‌ల ముందుగానే కాంగ్రెస్ అక్క‌డ సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌ కు యూపీలో సీఎం సీటును క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీంతో జానా ఇక్క‌డ మ‌రింత రెచ్చిపోతున్నారు.

ఇక‌, కాంగ్రెస్‌ లో మ‌రో వ‌ర్గం జానాకు ఎర్త్ పెట్టే ప‌నిని ఇప్ప‌టి నుంచే మొద‌లెట్టేసింది. మ‌రి వీరి లెక్క‌లు వీరివి. వీరే ఏకంగా సీఎం విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టి కే తీసుకెళ్లార‌ట‌. కేంద్రంలో మాజీ మంత్రిగా చేసిన ముక్కుసూటి వ్య‌క్తి అయిన జైపాల్ రెడ్డిని వారు తెర‌మీద‌కి తెచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆధిక్య‌త సాధిస్తే.. జైపాల్‌ ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని వారు గ‌ట్టిగా చెబుతున్నార‌ట‌.

అయితే, అధిష్టానం మాత్రం రాబోయే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాలపైనే దృష్టి పెట్ట‌డంతో ప్ర‌స్తుతానికి వీరి విజ్ఞ‌ప్తుల‌ను ప‌క్క‌న‌పెట్టింద‌ట‌. ఇదిలావుంటే, అస‌లింత‌కీ తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ దెబ్బ‌కి, సీఎం కేసీఆర్ ఆక‌ర్ష్ మంత్రానికి కాంగ్రెస్‌ లో ఎవ‌రుంటారో? ఎవ‌రు కారెక్కేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ టైంలో కాంగ్రెస్ నేత‌లు ఇలా ఊహ‌ల్లో విహారం చేయ‌డం - ఉట్టికి ఎగ‌ర‌లేని స్థితిలో సీఎం సీటును అందుకోవాల‌నుకోవ‌డం కాంగ్రెస్‌ లోనే చెల్లుతోంద‌ని విప‌క్ష నేత‌లు త‌మ‌లో తామే ముసిముసిగా న‌వ్వుకుంటున్నారు.