Begin typing your search above and press return to search.

మజ్లిస్ రెచ్చిపోవటంపై టీ కాంగ్రెస్ రియాక్షన్?

By:  Tupaki Desk   |   5 Feb 2016 4:34 AM GMT
మజ్లిస్ రెచ్చిపోవటంపై టీ కాంగ్రెస్ రియాక్షన్?
X
మీరో రోడ్డు మీద వెళుతున్నారు. మీ తప్పేమి లేకుండా ఒక వ్యక్తి మీ మీద సీరియస్ కావటమే కాదు.. మీరు ప్రయాణిస్తున్న కారులో నుంచి మిమ్మల్ని బయటకు లాగి దాడి చేస్తే..? మీరేం చేస్తారు. మీ పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య కోసం ప్రయత్నించటమే కాదు.. ఈ విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని రచ్చ రచ్చ చేస్తారు. తప్పు చేయకుండానే తన మీద దాడికి తెగబడిన వ్యక్తికి గుణపాఠం నేర్పాలన్న తాపత్రయం కనిపిస్తుంది. ఒకవేళ దాడి చేసిన వ్యక్తి స్థాయి పెద్దది అయితే.. వీలైనంత ప్రయత్నం చేసి.. అప్పటికి కుదరకపోతే మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేస్తారు.

ఒక సామాన్యుడే ఇంతలా రియాక్ట్ అయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రథసారధిగా ఉన్న వ్యక్తి.. తెలంగాణ శాసన మండలికి కాంగ్రెస్ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ఒక మైనార్టీ నేతపై.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన రౌడీ మూక చెలరేగిపోవటాన్ని ఏమనాలి? కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేయటాన్ని ఎలా పరిగణించాలి?

దీనిపై జరిగిన పరిణామాలు చూస్తే.. ఉత్తమ్.. షబ్బీర్ లపై దాడి జరిగిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి.. సీనియర్ నేత భట్టి విక్రమార్క తదితరులు ప్రెస్ మీట్ పెట్టటం.. తర్వాతి రోజున గవర్నర్ నరసింహన్ కు.. ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సారథిపై జరిగిన దాడిపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యిందే లేదు. మజ్లిస్ రౌడీయిజాన్ని ప్రశ్నించి.. ఇంత దారుణంగా వ్యవహరించినా.. తెలంగాణ అధికారపక్షం నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు ఉందన్న ప్రశ్నను వేసినోళ్లు పెద్దగా కనిపించరు. ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసినోళ్లకు.. అంత పెద్ద నేతల్ని ఇష్టారాజ్యంగా కొట్టేస్తే.. రియాక్షన్ ఇంతేనా? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు.