Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో త‌ప్పిన ఎగ్జిట్ పోల్స్!

By:  Tupaki Desk   |   24 May 2019 8:31 AM GMT
తెలంగాణ‌లో త‌ప్పిన ఎగ్జిట్ పోల్స్!
X
ఏడు విడ‌త‌లుగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల లెక్క‌ను ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పేరుతో ప‌లు సంస్థ‌లు విడుద‌ల చేశాయి. అంద‌రి దృష్టి బీజేపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? అన్న దాని మీద దృష్టి పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న‌ట్లే.. ఆయ‌న‌కు భారీ మెజార్టీని క‌ట్ట‌బెడుతూ దేశ ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చిన వైనం ఫ‌లితాల వెల్ల‌డి సంద‌ర్భంగా స్ప‌ష్ట‌మైంది.

ఈ హ‌డావుడిలో తెలంగాణ‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాల‌ను చాలామంది మ‌ర్చిపోయారు. దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రికం మీద అంచ‌నాలు నిజం కాగా.. తెలంగాణ విష‌యంలో ప‌లు పేరుమోసిన మీడియా సంస్థ‌లు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ కావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే-ఏక్సిస్ పోల్ స‌ర్వే మాత్రం తెలంగాణ ఫ‌లితాలకు ద‌గ్గ‌ర‌గా త‌న అంచ‌నాల్ని వెల్ల‌డించింది. 10 నుంచి 12 సీట్లు టీఆర్ ఎస్ కు.. ఒక‌టి నుంచి మూడు సీట్లు బీజేపీకి.. కాంగ్రెస్ కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. దీనికి త‌గ్గ‌ట్లే తొమ్మిది స్థానాలు టీఆర్ ఎస్ కు.. బీజేపీకి నాలుగు.. కాంగ్రెస్ కు మూడు స్థానాలు సొంతం చేసుకోగ‌లిగింది. మ‌జ్లిస్ ఒక్క స్థానంలో విజ‌యం సాధించింది. ఇండియా టుడే మిన‌హా మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు టీఆర్ఎస్ కు 12-15 స్థానాలు ఖాయ‌మ‌న్న లెక్క‌నే వినిపించాయి.

టైమ్స్ నై-వీఎంఆర్ పోల్స్ టీఆర్ ఎస్ కు 13 స్థానాలు.. కాంగ్రెస్ రెండుస్థానాలు.. బీజేపీ ఒక్క స్థానంలో గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెబితే.. ప్ర‌ముఖ రిప‌బ్లిక్ ఛాన‌ల్- సీ వోట‌ర్ సంస్థ అయితే టీఆర్ ఎస్ కు ఏకంగా 14 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్‌.. బీజేపీ.. మ‌జ్లిస్ ఒక్కొక్క స్థానంలో గెలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఇదే తీరులో ప‌లు ఎగ్జిట్ పోల్ సంస్థ‌లు టీఆర్ ఎస్ కు పెద్ద ఎత్తున సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేయ‌గా.. వాటి అంచ‌నాలు విఫ‌ల‌మ‌య్యాయి.