Begin typing your search above and press return to search.

ఏపీ విహారానికి ''నో'' చెబుతోన్న టీ సర్కార్‌

By:  Tupaki Desk   |   24 May 2015 4:58 AM GMT
ఏపీ విహారానికి నో చెబుతోన్న టీ సర్కార్‌
X
రాష్ట్ర విభజన ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్క రాష్ట్రంగా ఉన్న ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోతే.. సరిహద్దు సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటుందన్నది తాజా ఉదంతంతో అర్థమవుతుంది.

విహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తున్న ఏపీ పర్యాటక శాఖకు చెందిన బోట్లను అనుమతించని పరిస్థితి. ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం వెళ్లిన భక్తులు అక్కమహాదేవి గుహలకు వెళ్లేందుకు మక్కువ చూపుతుంటారు. దీని కోసం బోటింగ్‌ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ బోట్లను నడుపుతోంది. ఈ బోటింగ్‌లో భాగంగా ఏపీ పరిధిలోని శ్రీశైలం నుంచి బయలుదేరి.. తెలంగాణ రాష్ట్రంలోని పది కిలోమీటర్ల ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తే అక్కమహాదేవి గుహలు చేరుకునే పరిస్థితి.

రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఏపీ సర్కారు నడుపుతోన్న బోటింగ్‌ సౌకర్యంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తమ అనుమతి తీసుకోవాలన్న తెలంగాణ సర్కారు మాటతో.. ఏపీ అధికారులు లేఖ రాశారు. అయితే.. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తాము వసూలు చేసే మొత్తంలో ప్రతి ఒక్క పర్యాటకుడి మీద రూ.50 చెల్లిస్తామని ఏపీ అధికారులు చెప్పినా తెలంగాణ సర్కారు అంగీకరించటం లేదు. దీంతో.. బోటింగ్‌ను ఆపేశారు. మొత్తానికి విభజన వ్యవహారం.. పర్యాటకం మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తుందో కదూ.