Begin typing your search above and press return to search.

మల్లన్న పిటిషన్ కు టీ హైకోర్టు ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   11 Aug 2021 5:01 AM GMT
మల్లన్న పిటిషన్ కు టీ హైకోర్టు ఏం చెప్పింది?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను బండకేసి బాదేసినట్లుగా మాట్లాడే వారి పేర్లను జాబితాగా తయారు చేస్తే.. అందులో మొదటి మూడు పేర్లలో తీన్మార్ మల్లన్న పేరు వస్తుంది. తాను చేసిన సూపర్ హిట్ ప్రాగ్రాం కాస్తా అతని ఇంటిపేరుగా మారిపోయింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే చాలామందికి సుపరిచితుడు. కసి పుట్టేలా మాట్లాడటమేకాదు.. అంతులేని ఎటకారం.. కేసీఆర్ చేసే తప్పుల్ని ఎత్తి చూపి.. దానికి ఆయన చేసే కామెంట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

కేసీఆర్ అంటేనే.. ఒంటికాలి మీద లేచే తీన్మార్ మల్లన్న .. ప్రతి వార్తలోనే కేసీఆర్ తప్పుల్ని ఎత్తి చూపించే టాలెంట్ ఆయన సొంతం. ఆ మధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి.. అనూహ్యంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. గులాబీ బాస్ కే కాదు.. ఆయనకు మద్దతు ఇచ్చే వారంతా కూడా మల్లన్న మాటలకు తెగ ఫీలైపోతుంటారు. అన్నేసి మాటలు అంటావా? అంటూ మండిపడుతుంటారు.

గులాబీ బాస్ మీద అదే పనిగా విమర్శలు సంధించే మల్లన్నపై ఈ మధ్యన పోలీసులకు ఫిర్యాదులు అందటం.. అంతే ఉరుకులు పరుగులు మీద బెటాలియన్ సైజు పోలీసు బలగాల్ని మల్లన్న ఆఫీసుకు పంపటం.. ఆయన్ను అభిమానుల్ని కంట్రోల్ చేయటానికి పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక.. మల్లన్న ఆఫీసులో జరిగిన తంతుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో పోస్టు చేశారు కూడా. మల్లన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపు విచారించి వదిలేయటం.. ఆ తర్వాత రెండు రోజులకు తమ ముందుకు రావాలని పోలీసులు ఆదేశించటం తెలిసిందే.

పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పిన మల్లన్న.. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ.. పోలీసులకు రాలేనని చెప్పి.. ఆ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు వేధిస్తున్నారని.. కారణాలు లేకుండానే పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన మీద సీసీఎస్ లోనూ.. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినట్లుగా హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. తనను పదే పదే స్టేషన్ కు పిలవకుండా ఆన్ లైన్ లోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి.. తెలంగాణ పోలీసులకు తీన్మార్ మల్లన్న వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. అనంతరం ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి వాయిదాకు ప్రభుత్వం.. తెలంగాణ పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. కోర్టు విచారణ పూర్తి అయ్యే వరకు తీన్మార్ మల్లన్నను పోలీసులు రౌండ్ చేయకుండా ఉంటారా? ఆయన్ను స్టేషన్ కు రమ్మని పిలవరు కదా? అన్న సందేహాల్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.