Begin typing your search above and press return to search.

హ‌స్తంలో ఏడు ప‌దులు దాటిన మ‌రో నేత‌..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 5:30 PM GMT
హ‌స్తంలో ఏడు ప‌దులు దాటిన మ‌రో నేత‌..!
X
తెలంగాణ కాంగ్రెస్ లో మ‌రో నేత ఏడు ప‌దుల వ‌య‌సును దాటారు. జానారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, సుద‌ర్శ‌న్‌రెడ్డి, రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డి, హ‌నుమంత‌రావు త‌దిత‌రుల దారిలో ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి కూడా వ‌చ్చారు. నేడు పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి 70 ఏళ్ల వ‌య‌సును క్రాస్ చేశారు. వ‌య‌సు పైబ‌డుతున్నా రాజ‌కీయాల్లో మాత్రం ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

తాటిప‌ర్తి జీవ‌న్‌రెడ్డి 1951, జ‌న‌వ‌రి 5న జ‌న్మించారు. తొలుత‌ వ‌కీలు విద్య‌ను అభ్య‌సించిన జీవ‌న్‌రెడ్డి జ‌గిత్యాల కోర్టులో న్యాయ‌వాదిగా జీవితాన్ని ప్రారంభించారు. మ‌ల్యాల నుంచి స‌మితి అధ్య‌క్షుడిగా మొద‌టిసారి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. 1983లో నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. యువ‌కులు, మేధావులు, న్యాయ‌వాదులు, డాక్ట‌ర్లు, వ్యాపార‌వేత్త‌లు.. ప‌లు రంగాల్లో ఉత్సాహవంతంగా ప‌నిచేస్తున్న వారిని ఆనాడు ఎన్టీఆర్ గుర్తించారు.

అందులో భాగంగానే నందమూరి తార‌క‌రామారావు ఆహ్వానాన్ని స్వీక‌రించిన జీవ‌న్‌రెడ్డి 1983లో టీడీపీలో చేరారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందిన నేత‌గా గుర్తింపు పొందారు. కేవ‌లం నాలుగుసార్లు మాత్ర‌మే ప‌రాజ‌యం పాల‌య్యారు. గుడిసెల రాజేశం గౌడ్‌, ఎల్ ర‌మ‌ణ‌, సంజ‌య్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఎల్ ర‌మ‌ణ జీవ‌న్‌రెడ్డిని రెండుసార్లు ఓడిస్తే.. జీవ‌న్‌రెడ్డి ర‌మ‌ణ‌ను మూడుసార్లు ఓడించారు.

ఎన్టీఆర్ కేబినెట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జీవ‌న్‌రెడ్డి.. నాదెండ్ల భాస్క‌ర‌రావు కేబినెట్‌లో పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టారు. 1985లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవ‌న్‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థి రాజేశం గౌడ్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. 1989లో తిరిగి గెలుపొందారు. 1994, 2009లో ర‌మ‌ణ చేతిలో ఓడిపోయారు. 1996 ఉప ఎన్నిక‌లో గెలుపొందిన జీవ‌న్‌రెడ్డి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. 1999, 2004లో కూడా హ్యాట్రిక్ విజ‌యం సాధించారు.

2006 లోక్‌స‌భ ఎన్నిక‌లో పోటీచేసి ఓడిపోయారు. 2008లో మ‌రోసారి లోక్‌స‌భ ఎన్నిక‌లో పోటీ చేసి కేసీఆర్ పై గెలిచినంత ప‌నిచేశారు. వైఎస్ కేబినెట్‌లో రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి ప‌ద‌వి నిర్వ‌ర్తించారు. 2014 లో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న స‌మ‌యంలో కూడా ఆయ‌న కాంగ్రెస్ నుంచి తిరిగి గెలుపొందారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది శాస‌న‌స‌భ ప‌క్ష ఉప నేత‌గా ఎన్నిక‌య్యారు.

2018లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సంజ‌య్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొంది మండ‌లిలోకి అడుగుపెట్టారు. స‌మితి నుంచి మండ‌లి దాకా అలుపులేకుండా పోరాడుతున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏడు ప‌దులు దాటినా రాజ‌కీయాల్లో ఇంకా న‌వ‌య‌వ్వ‌నంతో ముందుకు సాగుతున్నారు.