Begin typing your search above and press return to search.

మంత్రి పీఆర్వో వార్త ఏమో కానీ పెళ్లి ఆగింద‌ట‌?

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:39 AM GMT
మంత్రి పీఆర్వో వార్త ఏమో కానీ పెళ్లి ఆగింద‌ట‌?
X
ఒక పీఆర్వో స్థాయి ఏమిటి ? ఎంత ప‌వ‌ర్ ఉంటుంది? అన్న సందేహం ఇప్పుడు చాలామందికి వ‌స్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి పీఆర్వో న‌డిపిస్తున్న హడావుడి వీడియో టేపుల‌తో స‌హా బ‌య‌ట‌కు రావ‌టంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పీఆర్వో అంటే ప్రెస్ నోట్లు త‌యారు చేయ‌ట‌మే.. అలాంటోడు ఏం చేయ‌గ‌ల‌డు చెప్పండంటూ చాలామంది చెప్ప‌టం క‌నిపిస్తుంది.

కానీ.. పీఆర్వో కుర్చీలో కూర్చోబెడితే.. ఏకంగా మ‌రో మంత్రినే బెదిరించొచ్చ‌న్న వైనం తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతంలో బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ స్టేట్ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఉద్యోగి పీలి కృష్ణ తెలంగాణ రాష్ట్ర మంత్రి టి ప‌ద్మారావు ద‌గ్గ‌ర పీఆర్వో గా ప‌ని చేస్తున్నారు.

త‌న‌కున్న ప‌వ‌ర్ తో పాటు.. కాస్త అతిని జోడించి నోటి దూల‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నిజంగానే పీలి కృష్ణ‌కు నోరెక్కువా? ఆయ‌న అంద‌రి మీద నోరు పారేసుకుంటాడా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఎవ‌రి అనుభ‌వం వారు చెబుతుంటారు. మొత్తంగా చూస్తే.. పీలి కృష్ణ వ్య‌వ‌హారంలో లెక్క కాస్త తేడా ఉంద‌న్న‌ది మెజార్టీ వ‌ర్గీయుల అభిప్రాయం.

దీని ప‌క్క‌న పెడితే.. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన టేపులు పీలి కృష్ణ ఎంత‌గా హ‌వా న‌డిపిస్తారో అర్థ‌మై చాలామంది అవాక్కు అయ్యారు. ఈ వివాదం ముద‌ర‌టంతో మంత్రి ప‌ద్మారావు సీన్లోకి వ‌చ్చి.. త‌న ద‌గ్గ‌ర పీఆర్వోగా ప‌ని చేస్తున్న పీలి కృష్ణ‌ను అత‌డి మాతృ సంస్థ‌కు స‌రెండ‌ర్ చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. మ‌రో మంత్రిని బెదిరించ‌టంపై స్పందిస్తూ.. అది బ‌య‌ట జ‌రిగింద‌ని.. దాంతో త‌న‌కు సంబంధం లేద‌ని చెబుతూ.. మంత్రినే బెదిరించ‌టం స‌రికాదంటూ త‌న పీఆర్వో చేసింది త‌ప్పనే మాటను తేల్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే..పీలి కృష్ణ‌కు సంబంధించి ఒక కొత్త విష‌యాన్ని చెబుతున్నారు. అత‌గాడికి పెళ్లి కుదిరింద‌ని.. మ‌రికొద్ది రోజుల్లో పెళ్లి అనుకున్న వేళ‌.. అత‌డిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో పెళ్లి వ్య‌వ‌హారం ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా తెలుస్తోంది. ఇది వ్య‌క్తిగ‌త అంశ‌మే అయినా.. ఒక వ్య‌క్తి మీద వ‌చ్చిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అత‌డి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు ప్ర‌భావితమైన నేపథ్యంలో ప్ర‌స్తావించ‌టం త‌ప్పు కాద‌నే చెప్పాలి. ఏమైనా ఇప్ప‌టివ‌ర‌కూ టీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు.. ఇత‌ర చోటా నేత‌ల కార‌ణంగా త‌ర‌చూ వివాదాలు చోటు చేసుకోవ‌టం మామూలుగా మారింది. ఇవి స‌రిపోవ‌న్న‌ట్లు ఇప్పుడు పీఆర్వోవోల వ్య‌వ‌హారం కూడా రచ్చ కావ‌టంపై తెలంగాణ అధికార‌ప‌క్షం ఒకింత అస‌హ‌నంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.