Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు వ్యతిరేకమా?..రాజయ్య భలే సర్దుకున్నారబ్బా!

By:  Tupaki Desk   |   10 Sep 2019 12:31 PM GMT
కేసీఆర్ కు వ్యతిరేకమా?..రాజయ్య భలే సర్దుకున్నారబ్బా!
X
తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ ఎస్)లో ఇటీవలి కాలంలో నిరసనల స్వరం అంతకంతకూ పెరుగుతోందన్న మాట ఓ వైపు నుంచి వినిపిస్తున్నా... మరోవైపు ఆ గళాలన్నీ మరోమారు తమ వాయిస్ ను విస్పష్టంగా ప్రకటించేందుకు మాత్రం సాహసించడం లేదు. ఏదో ఒకసారి అలా తమ నోటికి పనిచెప్పేసిన అసంతృప్తులు... ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. ఈ తరహా నేతలు ఇప్పటికే ముగ్గురు బయటపడ్డారు. ఈ జాబితాలోకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా రికార్డులకు ఎక్కిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కూడా చేరిపోయారన్న వార్తలు వినిపించినంతనే... ఆయన చాలా చాకచక్యంగా సదరు లిస్టులో తన పేరు లేదని తేల్చి చెప్పేశారు.

ఇప్పటిదాకా టీఆర్ ఎస్ అధిష్ఠానంపై మంత్రి ఈటల రాజేందర్ తనదైన శైలి అసంతృప్తి వ్యక్తం చేస్తే... ఆయన మాటలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమర్థించినట్టుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలతో పార్టీలో ఏదో జరుగుతోందని అంతా అనుకుంటున్న సమయంలోనే మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా తనదైన శైలి నిరసన గళం విప్పారు. మొత్తంగా కేవలం వారం వ్యవధిలో ముగ్గురు కీలక నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తే... ఆ జాబితా అంతకంతకూ పెరిగే అవకాశాలూ లేకపోలేదన్న వాదనలు వినిపించాయి.

ఈ క్రమంలోనే ఈ జాబితాలో తాను కూడా ఉన్నానన్న కోణంలో తాడికొండ రాజయ్య పార్టీ అధిష్ఠానంపై నిరసన గళం వినిపించారు. అయితే తనను పై ముగ్గురితో కలిపి చూసేలోగానే చాలా తెలివిగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారనే కంటే కూడా అసలు తాను అలా మాట్లాడలేనే లేదని - తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని కూడా రాజయ్య తనదైన శైలి సర్దుబాటును ప్రదర్శించారు. తెలంగాణకు తొలి డిప్యూటీ సీఎంగానే కాకుండా - తన వృత్తి వైద్యం అయితే అదే శాఖ మంత్రిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్ - కేటీఆర్ లకు తాను ఎన్నటికీ విధేయుడినేనని కూడా రాజయ్య చెప్పుకొచ్చారు. తనకు ఇంత చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి ఏమిచ్చినా తాను రుణం తీర్చుకోలేనని కూడా రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ - కేటీఆర్ నాయకత్వాలను తాను బలపరుస్తున్నానని కూడా రాజయ్య మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను కేవలం మంత్రిగానే కాకుండా... తెలంగాణ రాజన్నగా తనను తీర్చిదిద్దారని - అలాంటి కేసీఆర్ ను తాను ఎందుకు వ్యతిరేకిస్తానని కూడా రాజయ్య తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. కేవలం కేసీఆర్ పుణ్యంతోను స్టేషన్ ఘన్ పూర్ నుంచి తాను ఇన్నేసి సార్లు అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వస్తున్నానని కూడా రాజయ్య అన్నారు. ఇదంతా బాగానే ఉన్నా... కేసీఆర్ తన తొలి కేబినెట్ లో రాజయ్యకు సముచిత స్థానం ఇచ్చినట్టే ఇచ్చి... డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న రాజయ్యను ఏకంగా బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ పై రాజయ్య నిరసన గళం వినిపించారని వచ్చిన వార్తలు విన్నంతనే అవి నిజమేనని అంతా అనుకున్నారు. అయితే రాజయ్య వాటిని ఖండించేసి తనను తాను సేఫ్ జోన్ లో ఉండేలా చేసుకున్నారని చెప్పాలి.