Begin typing your search above and press return to search.

వాస్తవ జలదృశ్యంపై రిటైర్డ్ ఇంజినీర్ల గుస్సా

By:  Tupaki Desk   |   19 Aug 2016 4:43 AM GMT
వాస్తవ జలదృశ్యంపై రిటైర్డ్ ఇంజినీర్ల గుస్సా
X
వాస్తవ జలదృశ్యం పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ మీద తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రియాక్ట్ అయ్యింది. కాంగ్రెస్ చేసిన వాదనలో పసలేదన్నఇంజినీర్ల ఫోరం.. తమపై విమర్శలు చేయటాన్ని ఖండించారు. తాము ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నామని అలాంటి తమను గులాబీ రంగు పూసుకుంటున్నమని కాంగ్రెస్ నేత శ్రవణ్ చేసిన విమర్శల్ని ఖండించారు. గతంలో గులాబీ రంగు పూసుకున్న శ్రవణ్ కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వ్యక్తిలా తమపై విమర్శలు చేయటం సబబు కాదని రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం మండిపడింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ రీడిజైనింగ్ రాష్ట్రానికి శుభసూచకంగా అభివర్ణించిన ఫోరం.. ప్రభుత్వానికి అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులలోని లోపాల్ని సవరిస్తూ.. రీడిజైనింగ్ చేసిందంటూ ఫోరం అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శులు వివరించే ప్రయత్నం చేశారు.

ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు సవరించిన జీవో 123కు తాము సహకరిస్తున్నామని.. చట్టప్రకారం భూసేకరణకు పదేళ్లు అయినా పట్టొచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన ప్రత్యామ్నాయం ద్వారా భూమి సేకరించేందుకు చట్టంలో అవకాశం ఉందన్నారు. గోదావరి నుంచే కాకుండా పాలమూరు –రంగారెడ్డి - డిండి ఎత్తిపోతల పథకాలకు కలిపి రోజుకు మూడు టీఎంసీలు తీసుకోవాలని ప్రభుత్వానికి తాము సూచించామని చెప్పారు.

వర్షాలు పడుతున్నప్పుడునీళ్లను రిజర్వాయర్ లోకి మళ్లించటం.. నికర జలాలకే కాకుండా మిగులు జలాల్లోనే తీసుకోవటం ద్వారా రిజర్వాయర్లు నింపితే రెండో పంటకు.. పరిశ్రమలు.. తాగునీటికి ఉపకరిస్తుందన్నారు. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం మార్చటం వల్ల అదిలాబాద్ లో 90 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతం పెరిగిందని.. రీడిజైనింగ్ కారణంగా 120 టీఎంసీలే కాదు వరద జలాలు 300 టీఎంసీల వరకూ తీసుకోగలమన్నారు. కాంగ్రెస్ పేర్కొన్న వాస్తవ జలదృశ్యంలోని అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లు తప్పు పట్టటం బాగానే ఉన్నా.. పాయింట్ల వారీగా లేవనెత్తిన పలు సూటి ప్రశ్నలకు ఫోరం సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న గణాంకాల్లో పస లేదంటూ స్పష్టంగా చేసేలా చెప్పిన లెక్కలపై మరింత వివరంగా ఫోరం సమాధానం చెప్పి ఉంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.