Begin typing your search above and press return to search.
మహానాడు పెట్టి..కేసీఆర్ కు సారీ చెప్పిన టీడీపీ
By: Tupaki Desk | 24 May 2018 11:09 AM GMTహైదరాబాద్ వేదికగా సాగిన టీడీపీ మహానాడు ఆసక్తికరమైన పరిణామానికి వేదిక అయింది. టీడీపీ తెలంగాణ విభాగం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సారీ చెప్పారు. అవును. ఆయనపై పోరాటం చేయాల్సిన టీడీపీ ఆయనకే క్షమాపణ చెప్పడం ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? వివరాల్లోకి వెళితే...మహానాడు నేపథ్యంలో గురువారం 10 గంటలకు మహానాడు ప్రారంభం అయింది. ఈ సభకోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు.
ఈ సందర్భంగా కళాకారులు పొరపాటు చేశారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఆయన పథకాలను విమర్శిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వెటకారాలు ఆడుతూ కళాకారులు పాట పాడటం మొదలుపెట్టారు. పాటలో అసభ్యకర పదాలు ఉండటంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కలుగజేసుకున్నారు. వెంటనే పాటను ఆపించేశారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ పాట పాడిన కళాకారులను మందలించారు. మహానాడు వేదికపై ఇలాంటి పాట పాడినందుకు టీడీపీ తరపున క్షమాపణ చెప్పారు. ఇలాంటి పాట పాడాల్సింది కాదని.. ఇలాంటి వాటికి టీడీపీ వ్యతిరేకం అని సభా ముఖంగా వెల్లడించారు. వేదిక నుంచే మన్నించాలని ఎల్.రమణ కోరారు. తప్పులు చేసి ఉంటే.. ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఇలాంటి పదాలతో పాట పాడిన కళాకారులను.. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి పాట పడినందుకు చింతిస్తున్నామని ఎల్.రమణ విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఈ మహానాడు టీడీపీకి కీలకంగా మారిందని తెలుస్తోంది. ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ యాత్రలు, ప్రత్యేక సభలతో స్పీడు పెంచడంతో టీడీపీ కూడా జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై మహానాడులో చర్చించనున్నారు. రాష్ట్ర మహానాడుకు ముందే జిల్లాల్లో మినీమహానాడు సభలను పూర్తి చేసింది టీడీపీ నాయకత్వం. చాలామంది సీనియర్లు, ఎమ్మెల్యేలు ఇరత పార్టీల్లోకి వలస వెళ్లినా క్యాడర్ తమతోనే ఉందని చెబుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజులు విశాఖలో టీడీపీ మహానాడు జరుగనుంది.