Begin typing your search above and press return to search.

వన్డేలకు తగనివాడు.. టి20 కెప్టెన్.. సఫారీలకు నాన్ ప్లేయింగ్ సారథి

By:  Tupaki Desk   |   30 Oct 2022 2:30 AM GMT
వన్డేలకు తగనివాడు.. టి20 కెప్టెన్.. సఫారీలకు నాన్ ప్లేయింగ్ సారథి
X
0, 0, 3, 8, 2, 2.. ఇవి ఫోన్ నంబర్లు కాదు.. అంతర్జాతీయ మ్యాచ్ లలో ఓ బ్యాట్స్ మన్ స్కోర్లు. అది కూడా ఓ పెద్ద జట్టుకు సారథ్యం వహిస్తున్న బ్యాట్స్ మన్ స్కోర్లు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కొంతకాలంగా ఎలా ఆడుతున్నాడో చెప్పే గణాంకాలివి. సాధారణంగా ఓ బ్యాట్స్ మన్ ఈ విధంగా ఆడితే జట్టులో చోటే ఉండదు. కానీ, బవుమా కెప్టెన్ కావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పటికీ.. కొంత విరామం తీసుకుని మైదానంలోకి దిగుతున్నా బవుమా పూర్తిగా విఫలమవుతున్నాడు.

జట్టంతా అలా.. కెప్టెన్ ఇలా

బవుమా వన్డేలకు కూడా దక్షిణాఫ్రికా సారథి. టెస్టుల్లో వైస్ కెప్టెన్. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడి ఫామ్ దారుణంగా ఉంటోంది. టెస్టుల్లో కాస్తో కూస్తో నిలకడ చూపే ఇతడు.. అసలు వన్డేలకే పనికి రాడంటే ఏకంగా టి20లూ ఆడిస్తూ కెప్టెన్ చేశారు. డివిలియర్స్, డుప్లెసిస్ తప్పుకోవడం, డికాక్ సారథ్యం వద్దనడంతో బవుమాకు బాధ్యతలు అప్పగించారు.

కానీ, వాస్తవానికి అతడు టెస్టు ప్లేయర్. టి20లకు తగిన షాట్లు కానీ.. నైపుణ్యం కానీ బవుమా వద్ద లేవు. ఇప్పటివరకు 29 టి20 ఇన్నింగ్స్ లు ఆడిన అతడు చేసిన పరుగులు 569. స్ట్రయిక్ రైట్ 115. దీన్నిబట్టే చెప్పొచ్చు. కానీ, మిగతా జట్టంతా సూపర్ ఫామ్ లో ఉంది.

ఫామ్ లో ఉన్నారు

రిల్లీ రోసౌ.. రీజా హెండ్రిక్స్.. మార్క్ రమ్, క్లాసెన్ ఇదీ దక్షిణాఫ్రికా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్. వీరికితోడు సీనియర్లు డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్. యువ కెరటం ట్రిస్టన్ స్టబ్స్. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే అన్రిచ్ నార్జ్.. పదునైన బౌలర్ కగిసొ రబడ.. పేస్ ఆల్ రౌండర్ ఫెలూక్వాయో.. స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషిలతో దక్షిణాఫ్రికా అత్యంత బలంగా కనిపిస్తుంది. మిగతా జట్లలోనూ వీరికి దీటైన, వీరిని మించిన ప్రతిభావంతులున్నప్పటికీ.. సఫారీ జట్టులో అందరూ ఫామ్ లో ఉండడం సానుకూలాంశం.

బవుమాపై వేటు పడితే భారతీయుడే కెప్టెన్

ప్రస్తుత చాంపియన్ ఆస్ట్రేలియా అంత గొప్ప బలంగా ఏమీ లేదు. మాజీ చాంపియన్ భారత్ కు కొన్ని లోపాలున్నాయి.. ఇక భీకరమైన జట్టుగా పేరున్న ఇంగ్లండ్ ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పాకిస్థాన్ ఎప్పుడూ అనిశ్చితే. బంగ్లాదేశ్, శ్రీలంక సాధారణ జట్లే. అఫ్గానిస్థాన్ నుంచి సంచనాలు తప్ప టైటిల్ ఎగురేసుకుపోయే ప్రదర్శనను ఆశించలేం.

మరి.. అసలు ప్రపంచ కప్ ఫేవరెట్ ఎవరు? దీనికి సమాధానం దక్షిణాఫ్రికా. ఔను ఆ జట్టు ఆట తీరు చూస్తే.. ఇటీవల ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ లోనే మట్టికరింపిచన వైనం చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. కనీసం రెండంకెలు కూడా స్కోరు చేయలని అయితే, బవుమా వైఫల్యమే వారిని బాధపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్ అనంతరం బవుమా కొనసాగింపు కష్టమే. అదే జరిగితే భారతీయ సంతతికి చెందిన కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.